పండుగలా చెరువుల పునరుద్ధరణ

కళకళలాడే చెరువులు. నిగనిగలాడే రోడ్లు. గలగలలాడే వాటర్‌గ్రిడ్. ఇదీ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యాలు. చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించే రోజు ఆ ఊరంతా పండుగ చేసుకుంటున్నట్లుగా మంగళహారతులతో, డప్పువాయిద్యాలతో అట్టహాసం ప్రదర్శించాలి. ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి.

Harish Rao review meet in Nizamabad

-చెరువునాది అనే భావనతో ప్రతి గ్రామస్తుడూ పాల్గొనాలి
-ఎన్నారైలూ దత్తత తీసుకోవచ్చు..ఉద్యమస్ఫూర్తితో మిషన్ కాకతీయ
-నాణ్యత లోపిస్తే ఊరుకోం.. కాంట్రాక్టర్లకు మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక
ఈ చెరువ నాది అనే భావన ప్రతి ఒక్కరికీ కలగాలి. చెరువు పనుల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులే కాదు, సీఎం, గవర్నర్‌కూడా పాల్గొనబోతున్నారుఅని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏర్పాటు చేసిన చిన్ననీటి వనరుల పునరుద్ధరణ అవగాహనసదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఎన్నారైలు కూడా చెరువులను దత్తత తీసుకొవచ్చునని, చెరువు పునరుద్ధరణకు నిధులను భరిస్తే..వారు సూచించిన పేరునే చెరువుకు పెడుతామన్నారు. ఉద్యమస్ఫూర్తితో చెరువుల పునరుద్ధరణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పూడికతీతతో పాటు చెరువు గట్టుపై చెట్లునాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నట్లు వివరించారు. తాటివనాలు పెంచితే గీత కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. శిఖం భూముల కబ్జాల తొలగింపులో రెవెన్యూ అధికారులు, ఇగిరేషన్ అధికారులకు అండగా ఉండాలన్నారు. కబ్జాల పర్వంలో వ్యక్తులకు బాసట గా నిలిచే ప్రయత్నం ప్రజాప్రతినిధులు చేయొద్దని సూచించారు.

ప్రాణహిత-చేవెళ్లకు జాతీయహోదా సాధిస్తాం
ఆంధ్రాపాలకుల చేతుల్లో చెరువులు పూర్తిగా ధ్వంసమయ్యాయని మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలోని అన్నిచెరువుల్లో కలిపి 268 టీఎంసీల నీటిని నిలువ చేసుకునే సామర్థ్యం ఉండేదని, ఇప్పుడు పరిస్థితి విరుద్ధంగా మారిందన్నారు. అందుకే సీఎం కేసీఆర్ మిషన్‌కాకతీయను ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నారని గుర్తు చేశారు.

ప్రాణహిత- చేవెళ్ల పూర్తికావడానికి నాలుగైదు ఏండ్లు పడుతుందని, చెరువుల పునరుద్ధరణ వెంటనే పూర్తయితే ఫలాలు కూడా త్వరితగతిన ప్రజలకు అందుతాయన్నారు. గతంలో మాదిరిగా కాంట్రాక్టర్లు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తామంటే ఊరుకోబోమని తేల్చిచెప్పారు. గతంలో తక్కువ ధరకు కోట్‌చేసి పనుల్లో నాణ్యతలేకుండా చేశారని, ఇప్పుడలా జరగకుండా తక్కువధరకు కోట్‌చేస్తే అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ కట్టిస్తామని..పనులు సరిగ్గా చేయకపోతే ఆ మొత్తాన్ని జప్తు చేస్తామన్నారు. క్లాస్ -5 కాంట్రాక్టర్‌కు రూ.50 లక్షల వరకు పనులు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నామన్నారు.

ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ కచ్చితంగా జాతీయహోదా సాధించుకుని వస్తారనే నమ్మకముందని ధీమా వ్యక్తంచేశారు. అంతకుముందు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో మహిళా రైతు విశ్రాంతి భవనం, క్యాంటీన్, ఈ-బిల్డింగ్, గాల్‌వాల్యుమ్ షీట్‌రూఫ్ కవర్‌షెడ్‌ను ప్రారంభించారు. 2500మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల్గిన గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమల్లో జెడ్పీ చైర్మన్ దఫేదార్‌రాజు, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మేయర్ ఆకుల సుజాత, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, వీజీ గౌడ్, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్ షిండే, గంపగోవర్దన్,బాజిరెడ్డి గోవర్థన్, జడ్పీ వైస్ చైర్‌పర్సన్ సుమనరెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రోస్ జెడ్పీటీసీసభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు.

చెరువుల పునరుద్ధరణ సీఎం స్వప్నం: ఎంపీ కవిత
చెరువుల పునరుద్ధరణ సీఎం కేసీఆర్ స్వప్నమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. చెరువుల పునరుద్ధరణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఏదుల్లా గ్రామానికి చెందిన రైతు రాంచంద్రారెడ్డి అప్పటి సీఎం కాసుబ్రహ్మానందరెడ్డి వద్దకు వెళ్లి.. మా ఊళ్లో చెరువు తెగిపోయింది. బాగు చేయండని వేడుకున్నారు. దానికి బ్రహ్మానందరెడ్డి బదులిస్తూ, మీ చెరువులన్నీ నిండితే మాకు నీళ్లెక్కడి నుంచి వస్తాయి? అని మాట్లాడిన మాటల్ని తరుచూ సీఎం కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్‌సార్ గుర్తుచేసుకునే వాళ్లు. చెరువులను కుట్రపూరితంగానే ఆంధ్రా పాలకులు ధ్వంసం చేశారనడానికి ఈ సంఘటనే నిలువెత్తు నిదర్శనం అని కవిత ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు శారు. ప్రాణహిత- చేవెళ్లకు త్వర లో జాతీయ హోదా రానుందని ధీమా వ్యక్తంచేశారు.