పంద్రాగస్టు నుంచి కొత్త పథకం గ్రామ జ్యోతి

గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. 25 వేల కోట్ల రూపాయలతో గ్రామాల సమగ్రాభివృద్ధికి పూనిక తీసుకుంటున్నది. గ్రామపంచాయతీలకే గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించే అవకాశమిచ్చి, వాటికి నిధులు సమకూర్చే బాధ్యతను తలదాల్చనున్నది. ఒక్కో గ్రామానికి కనీసం రూ.2 కోట్ల నుంచి రూ.6 కోట్ల దాకా సమకూర్చి అభివృద్ధికి దారులు వేయాలని సంకల్పించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మేధోశిశువుగా రూపొందిన ఈ పథకానికి గ్రామజ్యోతిగా నామకరణం చేశారు. దేశ స్వాతంత్య్రదినం ఆగస్టు 15న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

KCR 01

-వచ్చే ఐదేండ్లలో 25 వేల కోట్లతో సమగ్ర గ్రామీణాభివృద్ధి
-సీఎం కేసీఆర్ మరో వినూత్న పథకం ఆవిష్కరణ
-ఒక్కో గ్రామానికి 2 నుంచి 6 కోట్ల నిధులు.. గ్రామస్తులు కోరిన పనులతోనే ప్రణాళికలు
-మంత్రి కే తారకరామారావు నేతృత్వంలో క్యాబినెట్ సబ్‌కమిటీ
-వారంలో నివేదిక.. తరువాత విధివిధానాల ఖరారు.. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి
పంచాయతీరాజ్ బలోపేతమే లక్ష్యం: రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, అభివృద్ధిలో గ్రామ పంచాయతీలను క్రియాశీలం చేయడం లక్ష్యంగా గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించారు. గ్రామ స్థాయిలోనే ఆయా గ్రామ పంచాయతీలు ఎవరికి వారే సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం గ్రామజ్యోతిలో ప్రధానాంశం. గ్రామీణ ప్రాంతాల సమగ్ర, సమీకృత అభివృద్ధి కోసం రూపొందించిన ఈ గ్రామజ్యోతి పథకాన్ని ఆగస్టు 15 స్వాత్రంత్య దినోత్సవంనాడు లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించామని సీఎం ఆదివారం క్యాంపు కార్యాలయంలో గ్రామీణాభివృద్ధిపై జరిపిన సమీక్ష సమావేశంలో చెప్పారు.

నూతన కార్యక్రమంపై మంత్రులు కే తారకరామారావు, టీ హరీశ్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, సీఎంఓ అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, ఆర్ డబ్ల్యూఎస్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డిలతో ఆయన చర్చించారు. ఈ పథకం కింద ఒక్కో గ్రామానికి జనాభాను బట్టి రెండు నుంచి ఆరు కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం నిధులు సమకూర్చుతుందని సీఎం చెప్పారు. ఈ పథకం కింద వచ్చే ఐదేండ్లలో రూ.25 వేల కోట్లు ఖర్చు చేసి గ్రామాల స్వరూపాన్ని మార్చుతామని పేర్కొన్నారు. దీనిద్వారా గ్రామ పంచాయతీ వ్యవస్థ బలోపేతమవుతుందని, అభివృద్ధి ప్రక్రియలో గ్రామ పంచాయతీలు కీలకమవుతాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బయటి ప్రమేయం లేకుండా గ్రామాలలో ఎవరికి వారే అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకొని అభివృద్ధి చేయడమే గ్రామజ్యోతి ప్రధాన లక్ష్యమని సీఎం వివరించారు.

క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు: గ్రామజ్యోతి పథకంలో భాగంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు, వాటి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి పంచాయతీ రాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ నేతృత్వంలో క్యాబినెట్ సబ్‌కమిటీని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, ఆటవీశాఖ మంత్రి జోగురామన్నలను సభ్యులుగా నియమించారు.

వారం రోజుల్లో అధ్యయనం పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సబ్‌కమిటీ నివేదిక అందగానే గ్రామ జ్యోతి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. మంత్రి కేటీఆర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ, ప్రణాళికాశాఖ ముఖ్యకార్యదర్శులు, రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ఈనెల 30వ తేదీన మర్రిచెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో సమావేశం నిర్వహించనున్నామని సీఎం అధికారులకు తెలిపారు.

పంచాయతీ ప్రణాళికకు ప్రభుత్వ నిధులు:
ఫలానా గ్రామం ప్రత్యేకం అని కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం అవసరాలు తీర్చాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం ఈ సందర్భంగా అన్నారు. తమ గ్రామాలకు ఏ రకమైన పనులు కావాలో నిర్ణయించుకుని ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే ప్రణాళికలు సిద్ధం చేస్తే, వాటికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. అన్ని గ్రామాల్లో స్థానిక అవసరాలు, ఆవశ్యకతలనుబట్టి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడమే గ్రామజ్యోతి కార్యక్రమమని తెలిపారు.

రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలు తయారై, క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయడం కన్నా, ఎవరి అవసరాలకు తగినట్లు వారే ప్రణాళికలు తయారు చేసుకొని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేసుకోవడం ఉత్తమమైన మార్గమని సీఎం అన్నారు. ఇప్పటికే మన ఊరు-మన ప్రణాళిక వంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల గ్రామజ్యోతికి మంచి భూమిక ఏర్పడిందన్నారు.