పల్లెల్లో ఇక రైతన్నల పాలన

-రెండేండ్లలో తెలంగాణ రైతులే ధనవంతులు
-రైతుల సంఘటితానికే సమన్వయసమితులు
-కోటి ఎకరాలకు నీరే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి
-అన్నదాతలకు అండగా నిలుస్తాం..త్వరలో రైతువేదిక భవనాలు
-పలు జిల్లాల్లో అవగాహన సదస్సుల్లో మంత్రి పోచారం

ఇక పల్లెల్లో రైతన్నల పాలన మొదలవుతుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రెండేండ్లలో తెలంగాణ రైతులే ధనవంతులుగా మారుతారని చెప్పారు. కోటి ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని, రైతుల సంఘటితానికే సమన్వయసమితుల ఏర్పాటు తలపెట్టారని పేర్కొన్నారు. అన్నదాతలకు అన్నివిధాలా అండగా నిలుస్తామని, త్వరలో రైతువేదిక భవనాలు నిర్మిస్తామని తెలిపారు. రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న ఆయన, రైతులు సగర్వంగా తలెత్తుకునేలా వ్యవసాయరంగం అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన పలు జిల్లాల్లో ఎనిమిది మండల కేంద్రాల్లో రైతు సమన్వయసమితుల అవగాహన సదస్సుల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతు సమన్వయసమితి సభ్యులకు ఆదివారం నుంచి పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 14 వరకు మండలస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు.

ఆదివారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 51 మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు జరిగాయి. వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, కామారెడ్డి జిల్లా బిచ్కుంద, నిర్మల్ జిల్లా కుభీర్, కరీంనగర్ శివారులోని రేకుర్తి, జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో నిర్వహించిన రైతు సమన్వయసమితుల అవగాహన సదస్సుల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్దేశాల గురించి వివరించారు. ఆయా ప్రాంతాల్లో ఆయనతోపాటు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, గంగుల కమలాకర్, వ్యవసాయ కమిషనర్ జగన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు. జోగుళాంబ-గద్వాల జిల్లా గట్టు మండలంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో వైద్యారోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వీ శ్రీనివాస్‌గౌడ్, సూర్యాపేట జిల్లాలో విద్యుత్‌శాఖమంత్రి జీ జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు పాల్గొన్నారు. సమన్వయసమితుల అవగాహన సదస్సుల్లో భాగంగా సోమవారం మంత్రి పోచారం.. కొత్తగూడెం జిల్లా దమ్మపేట, ఖమ్మం జిల్లా పెనుబల్లి, మెదక్, సంగారెడ్డి జిల్లా ఆందోల్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రాలలో పాల్గొననున్నారు.

జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతారు. రైతు సమన్వయసమితుల అవగాహన సదస్సుల్లో మంత్రి పోచారం ఆరు సూత్రాలను రైతులకు వివరించారు. వారితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఒక ప్రభుత్వం రైతులను సంఘటితపర్చడమంటే మామూలు విషయం కాదన్నారు. రాష్ట్రంలోని 577 మండల, 10,773 గ్రామ రైతు సమన్వయసమితులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సమితుల్లో స్థానం పొందుతున్న 1.76 లక్షల మంది సభ్యులు రాష్ట్రంలోని 56 లక్షల మంది రైతులకు ప్రాతినిధ్యం వహించబోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో 1.10 కోట్ల ఎకరాలు సాగుకు యోగ్యమైన భూములు ఉన్నాయనీ, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని ఏటా రూ.లక్షా 20 వేల కోట్ల విలువైన పంటలు తీసే అవకాశం ఉన్నా రైతులకు స్థోమత లేని కారణంగా ఇది సాధ్యం కావడం లేదన్నారు. రైతులకు ఏటా ఎకరాకు రూ.8 వేల చొప్పున పెట్టుబడి సమకూర్చేందుకే ఈ సమితులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 15 నుంచి డిసెంబర్ 15 వరకు కలెక్టర్ల ఆధ్వర్యంలో భూ రికార్డుల ప్రక్షాళన కూడా చేపడుతున్నామని అన్నారు.