పక్కాగా హైదరాబాద్ హరితహారం

హైదరాబాద్‌లో హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నగరం చుట్టూ ఉన్న ఔటర్‌రింగ్ రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో అందమైన చెట్లు పెంచాలని నిర్దేశించారు. రింగురోడ్డు వెంట చాలాస్థలం ఉన్నదని, అందులో చెట్లు పెంచడం ద్వారా సద్వినియోగపరచాలన్నారు. నగరం చుట్టూ విస్తరించిన ఈ రోడ్డు పొడవునా భారీగా చెట్లు పెంచి పరిరక్షిస్తే అదే నగరానికి అందమైన హరితహారమవుతుందని అభిప్రాయపడ్డారు.

KCR

-ఔటర్ రింగ్‌రోడ్డు స్థలాల్లో భారీగా చెట్లు
-రిజర్వు ఫారెస్ట్‌ల చుట్టూ ప్రహరీగోడలు
-హైదరాబాద్‌లో లక్షా 50 వేల ఎకరాల ఫారెస్ట్‌భూమి
-భావితరాలకోసం నగరం హరితమయం కావాలి
-ఔటర్ రింగ్‌రోడ్డుపై బస్సులో సీఎం కేసీఆర్ పర్యటన
-అధికారులతో నగర హరితహారంపై సమీక్ష
నగరానికి వచ్చే వారికి రింగురోడ్డు హరితస్వాగతం పలకాలని ఆయన ఆకాంక్షించారు. మంగళవారం ఔటర్ రింగ్‌రోడ్డుపై కొండ్లకోయ నుంచి గచ్చిబౌలి- శంషాబాద్-నాగార్జునసాగర్ రోడ్డు, విజయవాడ రోడ్డు నుంచి ఘట్‌కేసర్ వరకు సీఎం కేసీఆర్ అధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో పర్యటించారు. రింగురోడ్డుపనులు, హరితహారం, రిజర్వ్‌ఫారెస్టుల పరిస్థితి తదితర అంశాలను ఆయన పరిశీలించారు. మేడ్చల్, మజీద్‌గడ్డ, నాదర్‌గుల్, గండిగూడ, మాదన్నగూడ, కండ్లకోయ, తుర్కయాంజాల్, గుర్రంగూడ, శ్రీనగర్, మంగళ్‌కాలనీ, అంబర్‌పేట, హయత్‌నగర్, బాచారం, నారపల్లి ప్రాంతాల్లోని రిజర్వ్‌ఫారెస్ట్‌లను సీఎం సందర్శించారు.

అక్కడున్న ప్లాంటేషన్‌ను పరిశీలించి వాటిని పరిరక్షణకు ఆధికారులకు సూచనలిచ్చారు. రిజర్వ్‌ఫారెస్ట్ స్థలాలు ఆక్రమణలకు గురయ్యే అవకాశమున్నందున వాటిచుట్టూ ప్రహరీగోడలు నిర్మించాలని ఆదేశించారు. రిజర్వ్‌ఫారెస్ట్ అంతర్భాగంలో ఇంకా చాలా ఖాళీ జాగాలున్నాయని, అక్కడకు వెళ్లి మొక్కలు నాటాలని అధికారులను అదేశించారు. తర్వాత ఘట్‌కేసర్ వద్ద పదిలక్షల మొక్కలు పెంచుతున్న నర్సరీని సందర్శించారు. ఈ ఏడాది అవసరాలకే కాకుండా వచ్చే ఏడాదికి కూడా సరిపోయే మొక్కలు పెంచాలని కోరారు. నగరాన్ని అందంగా తీర్చిదిద్దే పూల మొక్కలు ఎంపికచేసి బాగా పెంచాలని సూచించారు. ఔటర్‌రింగ్ రోడ్‌పై విజయవాడ రోడ్- వరంగల్ రోడ్ మధ్యనున్న మూసీ నది ప్రాంతాన్ని కూడా సీఎం కేసీఆర్ సందర్శించారు.

అక్కడి నుంచి గండిపేట సమీపంలోని ఔటర్‌రింగ్‌రోడ్ వరకు 42 కిలో మీటర్ల మేర ఇంటర్వెల్స్‌తో వంతెన నిర్మించాలని ప్రతిపాదించారు. పర్యటన తరువాత సీఎం అధికారులతో నగరంలో హరితహారంపై సమీక్ష నిర్వహించారు. వరంగల్ హైవే, రాజీవ్ రహదారి, మేడ్చల్ హైవే, ముంబైహైవే, చేవెళ్ల రోడ్, నార్సింగిరోడ్, బెంగుళూర్ హైవే, శ్రీశైలం రోడ్, సాగర్‌రోడ్, విజయవాడ రోడ్ల వెంట ఉన్న భూముల్లో లక్షలాది మొక్కలు నాటాలని ఆదేశాలు ఇచ్చారు. వచ్చిపోయే వారితో కలుపుకొని హైదరాబాద్ జనాభా కోటి వరకు ఉంటుందని, ప్రతి ఏటా పది శాతం జనాభా పెరుగుతూ వస్తున్నదని సీఎం చెప్పారు.

ఈ జనాభాకు తగినట్లుగా లంగ్ స్పేస్‌లను సిద్ధం చేయాలని, భావి తరాల కోసం నగరాన్ని చెట్లతో నింపాలని అన్నారు. హైదరాబాద్‌లో వివిధ ఫారెస్ట్ బ్లాక్‌ల కింద లక్షా 50 వేల ఎకరాల భూమి ఉందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలని సీఎం అధికారులకు నిర్దేశించారు. నగరంలో భూముల విలువ నానాటికి పెరుగుతున్నందున, ఆటవీ భూమి ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఘట్‌కేసర్ నుండి శామీర్‌పేట ఔటర్‌రింగ్ రోడ్డు పనులు అసంపూర్ణంగా ఉండడంపై వాకబు చేశారు. ఈ మార్గంలో రైల్వే లైనుపై బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఇతర కారణాల వల్ల నిర్మాణం పూర్తి కాలేదని, దీన్ని 2016 జనవరి నాటికి పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణం పూర్తయితే రాకపోకలు పెరుగుతాయని, వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారికి ఔటర్‌రింగ్ రోడ్డు స్వాగతం పలుకుతుందని సీఎం అన్నారు.

సీఎం కేసీఆర్ వెంట పర్యటించిన వారిలో రవాణశాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, యాదయ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలినిమిశ్రా, ఆటవీశాఖ కార్యదర్శి రాజేశ్వర్‌తివారి, పీసీసీఎఫ్ మిశ్రా, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, హరితహారం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అర్బన్ ఫారెస్డ్ డైరెక్టర్ శ్రీనివాస్, హైదరాబాద్ సీఎఫ్ నాగభూషణం, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్‌లు ఉన్నారు.