పక్కా ప్రణాళికతో బంగారు తెలంగాణ పక్కా

మన రాష్ట్రం- మన ఊరు, మన ప్రణాళికకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తొలిరూపం ఇచ్చారు. సోమవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన నవ తెలంగాణ సమాలోచన సదస్సులో ప్రణాళికలపై సీఎం సుదీర్ఘంగా అధికారులతో మేధోమథనం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో గ్రామ పంచాయతీలకే సర్వాధికారాలుంటాయని ముఖ్యమంత్రి చెప్పారు. పక్కా ప్రణాళికతో ముందుకుపోతే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. ఈ నెల 12 నుంచి 27 వరకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రణాళికల రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.

KCR

మన గ్రామం- మన ప్రణాళిక, మన మండలం-మన ప్రణాళిక, మన జిల్లా -మన ప్రణాళిక, మన పట్టణం- మన ప్రణాళిక, మన రాష్ట్రం-మన ప్రణాళికల పేరుతో ఎక్కడికక్కడ ప్రణాళికలు రూపొందించాలన్నారు. మొదటగా ఈ నెల 12 నుంచి 17 వరకు గ్రామ ప్రణాళిక తయారు కావాలని చెప్పారు. ప్రతిజిల్లాకు సగటున వేయి గ్రామాలున్నందున జిల్లా కలెక్టర్లు వేయిమంది అధికారులను గుర్తించాలన్నారు. ఒక గ్రామానికి ఒక అధికారిని నియమించి, వారి ద్వారా గ్రామసభలు నిర్వహించి ప్రణాళికలు ఖరారు చేయాలని ఆదేశించారు.

17 నుంచి 22 వరకు మండల స్థాయి ప్రణాళిక, 22 నుంచి 27 వరకు జిల్లా స్థాయి ప్రణాళికలను రూపొందించాలన్నారు. ఈ ప్రణాళికల తయారీ కోసం కలెక్టర్లకు సహకరించేందుకు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రతిజిల్లాకు కేటాయించనున్నామని చెప్పారు. ఈ జిల్లా స్థాయి ప్రణాళిక రూపొందిన తరువాత ఆగస్టు 1 నుంచి 10 వరకు రాష్ట్ర స్థాయిలో వర్క్‌షాప్ నిర్వహించి, రాష్ట్రస్థాయి ప్రణాళికను రూపొందించనున్నట్లు చెప్పారు. 10 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరుగుతుందన్నారు. ఒకవైపు ఎక్కడికక్కడ ప్రణాళిక రూపొందించుకుంటూనే, మరోవైపు ప్రజాప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ చెప్పారు.

హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ ఆర్డీ, ఎన్‌ఐఆర్డీ, అపార్డ్‌ బహ్మకుమారి సంస్థలలో సర్పంచ్‌లు, ఎంపీపీలు,జెడ్పీటీసీలకు శిక్షణనివ్వాలని సూచించారు. 19 నుంచి సర్పంచ్‌లకు, 23 నుంచి మండల అధ్యక్షులకు, 27 నుంచి జెడ్పీటీసీలకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వచ్చే శనివారం లేదా ఆదివారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్‌లో ఒకరోజు శిక్షణా కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పారు. మొత్తం ఈ ప్రణాళిక రూపకల్పన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సారధ్యం వహిస్తారన్నారు. మార్పుకోసం జరిగే ఈ కార్యక్రమానికి కలెక్టర్లు ప్రేరకులుగా మారాలని కేసీఆర్ ఉద్బోధించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా కలెక్టర్ల వ్యవస్థకు పూర్వవైభవం వస్తుందన్నారు. అధికారులకు రెండేళ్లదాకా బదిలీలు ఉండవని చెప్పారు.

ఒకటి రెండురోజుల్లో ప్రత్యేకాధికారుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాలని, వారితో పాటు తహశీల్దార్లు, ఎంపీడీఓలకు జిల్లా కేంద్రంలో ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఒక వైపు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ప్రణాళికలను రూపొందించుకుంటూనే, సమాంతరంగా శాఖల వారి ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు, ఆయాశాఖల కార్యదర్శులు కూడా ప్రణాళికలు సిద్ధంచేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి వచ్చిన ప్రణాళికలను, శాఖలవారి ప్రణాళికలను క్రోడీకరించి, బడ్జెట్‌కు రూపకల్పన చేయాలని చెప్పారు. ప్రణాళికల తయారీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భాగస్వామ్యం చేయాలని కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు.