పక్కా ప్రణాళికతో అభివృద్ధి

– సుందరీకరణ అధ్యయనానికి ఢిల్లీ, నాగపూర్, జైపూర్‌లో పర్యటన
– కమిటీల నివేదికలపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్

KCR-reveiw-meet-on-Swacch-Hyderabad-01
హైదరాబాద్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విస్తృత ప్రాతిపదికన చేపట్టాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం సమయంలో నగరంలో సమస్యలను గుర్తించడానికి ఏర్పాటుచేసిన సబ్ కమిటీల నివేదికలకు అనుగుణంగా నగర సుందరీకరణకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని చెప్పారు.

నగరంలో చెత్త సేకరణకు పక్కా ప్రణాళిక ఉండాలని, దానిపై ఒక అవగాహనకు రావటానికి ప్రయోగాత్మకంగా సర్కిళ్లవారీగా కొన్ని వాహనాలను తిప్పాలని అధికారులను ఆదేశించారు. నగర సుందరీకరణ విధానాలను అధ్యయనం చేసేందుకు ఈనెల 13, 14, 15 తేదీల్లో ఢిల్లీ, నాగపూర్, జైపూర్ నగరాల్లో ప్రజాప్రతినిధులు పర్యటించాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్ వర్క్స్, విద్యుత్ తదితర అంశాలపై ప్రజాప్రతినిధులతో ఏర్పాటుచేసిన సబ్ కమిటీల సమావేశం మంగళవారం ఎంసీహెచ్‌ఆర్డీలో జరిగింది. ఆయా అంశాలపై కమిటీలు సమర్పించిన నివేదికలను సీఎం కేసీఆర్ సమీక్షించారు.

చెత్త సేకరణకు ప్రత్యేక ఏర్పాట్లు
నగరంలో చెత్త సేకరణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకునే వరకు ప్రయోగాత్మకంగా కొన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇండ్లలోని చెత్తతోపాటు షాపులు, దవాఖానలు, ఫంక్షన్‌హాళ్లు, మార్కెట్లు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పుట్టుకొచ్చే చెత్తను తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో వ్యర్థా నిర్వహణ, నిర్వీర్యం కోసం రాంకీ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులపై పలువురు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో ఈ విషయంపై ఏం చేయాలనే అంశంపై కూడా తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారు. నగరంలోని వరదనీటి కాల్వల్లో పూడిక తొలగించాలని సూచించారు. విద్యుత్ లో ఓల్టేజీ సమస్య నివారణకు, ఇండ్లపై హైటెన్షన్ వైర్ల తొలగింపునకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.