పదివేల ఎకరాలకు సింగూరు నీళ్లు

-ఆగస్టు 15న విడుదల.. రబీలో మరో 10 వేల ఎకరాలకు
-భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి
-ఆలస్యానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ

Harish Rao press meet

మెతుకుసీమగా పేరొందిన మెదక్ జిల్లాలో రైతుల దుస్థితి చూస్తుంటే దుఃఖం వస్తున్నది. వర్షాల్లేక, బోర్లలో నీళ్లు పడక రైతులు వరుణుడిపై భారమేసి సాగుచేసిన పంటలు ఎండిపోతే దిక్కులేక ఆత్మహత్య చేసుకుంటున్నరు. రైతుల బాధలు తలుచుకుంటే కన్నీళ్లొస్తున్నాయి. జిల్లాలో ఏకైక ప్రాజెక్టు సింగూరు నుంచి నేటికీ ఒక్క ఎకరాకు నీరందించకపోవడంలో నిర్లక్ష్యం ఎవరిది? ఎత్తిపోతల ద్వారా సాగునీరందించడానికి చేపట్టిన కాల్వల పనులు ఎనిమిదేండ్లుగా నత్తనడకన సాగడానికి బాధ్యులెవరు? అంత నిర్లక్ష్యం జరుగుతుంటే గత పాలకులు పట్టించుకోలేదు. మెదక్ జిల్లాలోనే రైతులు ఎక్కువ సంఖ్యలో ఆత్యహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది.. భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఓ వైపు తీవ్ర ఆవేదన మరోవైపు ఆగ్రహంతో అన్న మాటలివి.

మంగళవారం మెదక్ జిల్లా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టు అతిథిగృహంలో నీటి పారుదలశాఖ అధికారులతో సింగూరు కాల్వ పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ఒక్క ఎకరాకు నీరందించని సింగూరు ద్వారా ఖరీఫ్‌లో పదివేల ఎకరాలకు సాగునీరందిస్తామని వెల్లడించారు. ఆగస్టు 15న సంగారెడ్డిలో జెండా ఆవిష్కరించి నేరుగా సింగూరుకు వచ్చి ఖరీఫ్‌లో పదివేల ఎకరాలకు నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. వచ్చే రబీలో మరో పదివేల ఎకరాలకు నీరిచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ రోజులోగా చిన్నపని పెండింగ్‌లో ఉన్నా అధికారులపై సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధిగా మేం ఇంత బాధపడుతుంటే, మీలో చలనం ఎందుకు రావడం లేదు.. రైతు లేకుండా మనకు బువ్వలేదని గుర్తుంచుకోండని హితవుపలికారు. తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

గత పాలకుల నిర్లక్ష్యంతోనే సింగూరు ఎత్తిపోతల కాల్వ నిర్మాణ పనులు ఎనిమిదేండ్లుగా నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు. గత పాలకులు కమీషన్ల కోసం పనిచేశారని, రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో సింగూరు కాల్వ పనులపై నాలుగుసార్లు స్వయంగా అధికారులతో సమీక్షించి పనుల్లో వేగం పెంచానని తెలిపారు. 29.9 టీఎంసీల సామర్థ్యం ఉన్న సింగూరులో ప్రస్తుతం 4 టీఎంసీల నీరుందని, ఎత్తిపోతల ద్వారా నీరందించడానికి మోటార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాల్వల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు భూసేకరణ పాలసీ 75 జీవో కింద 25 శాతం అదనపు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా భూ సేకరణకు అడ్డుపడడం కొందరు రైతులకు మంచిది కాదన్నారు.

పోలీసుల సహకారం తీసుకుని పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. పనులు నిలిచిపోయినచోట తక్షణమే భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయాలని జేసీ వెంకట్రాంరెడ్డిని ఆదేశించారు. రైతులకు సాగునీరందించడమే లక్ష్యంగా మీరు కష్టపడండి..నేను కష్టపడతానని సూచించారు. తర్వాత మనూరు మండలంలో బోరంచ ఎత్తిపోతల పనులను పరిశీలించారు. పైప్‌లైన్ ట్రయల్ రన్‌లో 80 చోట్ల లీకేజీ కావడంపై కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.22 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పనుల్లో నిధులు దుర్వినియోగమయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పోయింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది.. అధికారులు మొద్దునిద్ర వీడాలని హెచ్చరించారు. వెంటనే పైపులను మార్చాలని ఆదేశించారు. మంజీరాకు నీళ్లు వచ్చాక బోరంచ ద్వారా 2,900 ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. సమీక్షలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే బాబూమోహన్, నీటి పారుదలశాఖ చీఫ్ ఇంజినీర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

పవన్ వ్యాఖ్యలపై స్పందించి స్థాయి దిగజార్చుకోను
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. పట్టపగలు నగ్నంగా ఓట్ల కోసం నోట్లు పంచుతూ దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని వెనుకేసుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అవినీతిపై గంభీరంగా మాట్లాడే ఆయన, రేవంత్ విషయంలో మాట్లాడిన తీరుతో ఏపాటి నైతిక విలువలు ఉన్నాయో అర్థమైపోయింది. పవన్ వంటి విలువలు లేని వ్యక్తి గురించి మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకోనన్నారు. అవినీతికి పాల్పడిన వ్యక్తి రేవంత్‌తోపాటు ఆయనను ప్రోత్సహించిన చంద్రబాబును పవన్ వెనుకేసుకొచ్చారు. మంత్రి హరీశ్‌రావు ఆంధ్రోళ్లు అనే పదం తరచూ వాడుతున్నారన్న పవన్ వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించారు.