పారిశ్రామికవృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

-ఐటీ మంత్రి కేటీఆర్‌కు టై ప్రతినిధి బృందం వినతి

KTR 05-06-14

కొత్త రాష్ట్రం లో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే తగు సంఖ్యలో ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టై) ప్రతినిధి బృందం సూచించింది. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే టీ రామారావుతో టై ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు తెలంగాణకు విస్తృతంగా పెట్టుబడులను రప్పించేందుకు పలు సూచనలు చేశారు. కొత్త రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు. పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో సింగపూర్ విధానం సత్ఫలితాలిస్తుందని పేర్కొన్నారు.

కొత్త ప్రభుత్వ విధానాలు పెట్టుబడిదారీ వర్గానికి విశ్వాసం కల్పించేలా ఉండాలని, మార్కెటింగ్ ప్రచారంలో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సహకరించడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చునని టై అధ్యక్షుడు బుక్కపట్నం మురళి మంత్రి కేటీఆర్ దష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వం అమ లు చేసిన రీసెర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్‌ను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి టై తరఫున అన్నివిధాలుగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు. ఆ సూచనలపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్ రెండు వారాల తర్వాత పారిశ్రామిక రంగంపై కార్యాచరణను రూపొందించేందుకు రౌండ్ సమావేశాన్ని నిర్వహిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. మంత్రిని కలిసిన వారిలో క్లబ్స్ ఇండియా అధ్యక్షుడు హరి వల్లూరిపల్లి, టై చాప్టర్ సభ్యుడు భాస్కర్‌రెడ్డి, వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీని చంద్రపుత్లా, ఇన్నోమైండ్స్ సీఈవో మురళి కాకర్ల, ఓయిస్టర్ గ్రూప్ ఎండీ కే నర్సింగ్‌రావు, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సెంటర్ హెడ్ కాళీప్రసాద్, ఫోకస్ వెంచర్ ఎండీ అనంతరావు తదితరులున్నారు.

కేటీఆర్‌ను కలిసిన అమెరికా అధికారి
రాష్ట్ర ఐటీ, పం చాయతీరాజ్‌శాఖ మంత్రి రామారావును అమెరికా రాయబార కార్యాలయం రాజకీయ, ఆర్థిక వ్యవహారాల అధికారి ట్రావిస్ కొబెర్లి బుధవారం సచివాలయంలో కలిశారు. కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఇద్దరి మధ్య అమెరికా, తెలంగాణ రాష్ర్టాల మధ్య పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ జరిగినట్లు సమాచారం.

నేడు కేటీఆర్ బాధ్యతల స్వీకరణ:
రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రిగా కే టీ రామారావు గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు. సచివాలయంలో ఆయనకు డీ బ్లాకులోని 345 నంబరు గదిని కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.