మన రాష్ట్రంలో మన పండుగలు

తెలంగాణ సాంస్కతిక వేడుకలుగా వందల ఏండ్లుగా కొనసాగుతున్న బోనాల పండుగ, బతుకమ్మ పండుగలను ప్రభుత్వం రాష్ట్ర పండుగలుగా ప్రకటించింది. ఇన్నాళ్లూ సీమాంధ్ర పాలకులు నిర్లక్ష్యం చేసిన ఈ పండుగలను ఇకనుంచి సాంస్కతిక గౌరవంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించనున్నారు. తెలంగాణ బహుజనం ప్రకతి దేవతలుగా కొలుచుకునే మైసమ్మ, మాంకాలమ్మ, మారెమ్మ, ఉప్పలమ్మ, నల్లపోచమ్మ వంటి ఇంటి దేవతల పండుగలను కూడా ఇకనుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నది.

మరికొన్ని రోజుల్లో బోనాల పండుగ రానున్న నేపథ్యంలో నిర్వహణకు సంబంధించి సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. దాదాపు నాలుగుగంటలపాటు జరిగిన ఈ సమావేశంలో జంటనగరాలకు చెందిన ప్రజాప్రతినిధులతోపాటు దేవాలయాల సిబ్బంది, డీజీపీ, పోలీసు కమిషనర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బోనాల జాతరకు అవసరమైన ఏర్పాట్లపై త్వరితగతిన నివేదికలు తయారుచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నగరంలో బోనాలు నిర్వహించే అన్ని దేవాలయాలను పర్యవేక్షించి ఎక్కడ ఏ పనులు చేపట్టాల్సి ఉందో డిపార్ట్‌మెంట్‌వారీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బోనాల పండుగకు ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్‌లో దేవాలయాలకు ప్రత్యేకంగా కేటాయించాలని నిర్వాహకులు కోరారు. ఈ నెల 29న గోల్కోండ బోనాలతో హైదరాబాద్‌లో బోనాల జాతర సంబరాలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. సికింద్రాబాద్‌లో జూలై 13న బోనాలు, 14న రంగం కార్యక్రమం ఉంటుందన్నారు. పాతబస్తీలోని లాల్‌దర్వాజా మహంకాళి దేవాలయం బోనాలు జూలై 20న, 21న రంగం, యాత్ర ఉంటుందని తెలిపారు.