కేసీఆరే మా ముఖ్యమంత్రి

-ప్రజలకిచ్చిన హామీలే మమ్మల్ని గెలిపించాయి.
-నా విజయం తెలంగాణ ప్రజలకంకితం
-వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి

kadiyam

తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆరేనని వరంగల్ ఎంపీగా గెలుపొందిన కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్ అలుపెరుగని పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని, దాన్ని గుర్తించిన ప్రజలు తమకు ఓటు వేసి గెలిపించారని చెప్పారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీ వల్లే టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని కడియం శ్రీహరి అన్నారు. వరంగల్‌లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో సుమారు రెండు లక్షలకుపైగా మెజార్టీతో గెలుపొందిన కడియం శ్రీహరి తన విజయాన్ని తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారు. ఆరు దశాబ్దాల ఆకాంక్ష నెరవేరేందుకు 13 ఏళ్లుగా కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ నిర్వహించిన పోరాటం, తమ చిత్తశుద్ధిని ప్రజలు ఆదరించారని ఆయన చెప్పారు. దేశంలో అన్ని పార్టీలను ఏకం చేసి తెలంగాణకు అనుకూలంగా మద్దతు సమీకరించడం వల్లే తెలంగాణ ఏర్పాటైందని, ఇందులో కేసీఆర్ నిర్వహించిన పాత్ర మరుచిపోలేనిదని అన్నారు. ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి, అభివృద్ధి పనులకు పెద్దపీట వేశామన్నారు.

గత కాంగ్రెస్ పాలనలో అవినీతి, కుంభకోణాలు పెరిగాయని, స్వపరిపాలన, తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని ప్రజలు భావించారని తెలిపారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ సుడిగాలి పర్యటన కూడా తమ విజయానికి కలిసొచ్చిందన్నారు. వరంగల్ జిల్లాలోని రెండు లోకసభ, 9 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్నామన్నారు. పదిరౌండ్లు పూర్తయ్యే సరికి తనకు రెండు లక్షలకుపైగా మెజార్టీ వచ్చిందని అన్నారు. హామీలను నెరవేర్చి ప్రజాసంక్షేమానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు.