ఒక్కో జిల్లాలో వారం మకాం

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించడంతోపాటు, స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకొనేందుకు తాను త్వరలోనే జిల్లాల పర్యటన చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. వీలైతే వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా నుంచే పర్యటన ప్రారంభిస్తానన్నారు. ఒక్కో జిల్లాలో ఓవారం పాటు ఉండి, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తానన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులు, మంచినీటి ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలు తదితర నిర్మాణాలను స్వయంగా పరిశీలిస్తానన్నారు. స్థానికంగా ఉండే ఇతర సమస్యలను కూడా గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.

CM KCR review meet with adilabad TRS leaders

-వీలైతే ఆదిలాబాద్ నుంచే జిల్లాల పర్యటన
-నియోజకవర్గాల వారీగా సమీక్షలు
-తూర్పు ఆదిలాబాద్‌లో మార్పు తీసుకువద్దాం
-జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం
-శాఖల వారీగా మంత్రులకు సూచనలు
-కొమురం భీమ్ వారసులకు డబుల్ బెడ్రూం ఇండ్లు

అత్యంత వెనుకబడిన తూర్పు ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకశ్రద్ధ వహించాలని, నీటి పారుదల ప్రాజెక్టులు, రహదారులు, వంతెనల నిర్మాణం, విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటు, వైద్య సదుపాయాల మెరుగుదల తదితర అంశాలపై మరింత దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలోఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి తూర్పు ఆదిలాబాద్ అభివృద్ధి గురించి చర్చించారు. మంత్రులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించి అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యేలా చూడాలని అన్నారు. ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను సీఎం ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు.

ఆ ప్రాంతంలో తక్షణం చేపట్టాల్సిన పనులను, దీర్ఘకాలిక ప్రాతిపదికన చేయాల్సిన పనులను గుర్తించారు. ప్రతి మండలకేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు వేయాలని ప్రభుత్వం ఓ విధానంగా పెట్టుకున్నదని, దాని ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో కూడా అన్ని మండల కేంద్రాలకు డబుల్‌రోడ్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొన్ని గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లడానికి నదులు, కాల్వలు దాటే క్రమంలో పడవలు ఉపయోగించాల్సి వస్తున్నదని సీఎం అన్నారు. అలాంటి ప్రాంతాలను గుర్తించి వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిని వేగంగా అమలు చేయాలని చెప్పారు. రహదారులు, వంతెనల నిర్మాణపనుల్లో వేగం పెంచడానికి ఆయాప్రాంతాల్లో స్వయంగా పర్యటించాలని రోడ్లు, భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావును సీఎం కోరారు.

ఈమేరకు మంత్రులకు అప్పటికప్పుడు టెలిఫోన్‌లో సూచనలు చేశారు. మంచిర్యాల-చంద్రాపూర్ నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులను కూడా పర్యవేక్షించాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎత్తిపోతల పథకాలను వెంటనే పూర్తిచేయాలని నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావుకు సూచించారు. తూర్పు ఆదిలాబాద్ ప్రాంతంలో అదనపు సబ్‌స్టేషన్ల నిర్మాణం కూడా నత్తనడక నడుస్తున్నదని, ఈ పనులను స్వయంగా పర్యవేక్షించాలని విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డిని ఆదేశించారు. రెండుమూడు రోజుల్లోనే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతిధులు, అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయని, ఇక వాటిని వేగంగా అమలు చేయడమే మిగిలి ఉందని అన్నారు.

తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, వరంగల్ ఎన్నికల్లో ఈ విషయం మరోసారి స్పష్టమయ్యిందని, వారి నమ్మకం నిలబెట్టేలా ప్రభుత్వం పనిచేయాలని, ప్రజాప్రతినిధులు ప్రజల అవసరానికి తగ్గట్టు స్పందించాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జోడెన్‌ఘాట్‌లో కొమురం భీమ్ వారసులందరికీ డబుల్‌బెడ్రూం ఇండ్ల పథకం కింద గృహాలు మంజూరు చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ముఖ్యమంత్రిని కోరారు. కొమురం భీమ్ వారసులకు చెందిన 15 కుటుంబాలు గ్రామంలో ఉన్నాయని, వారందరికీ ఇండ్లు మంజూరు చేయాలని విన్నవించారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వవిప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, విఠల్‌రెడ్డి, చిన్నయ్య, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీఎం అదనపు కార్యదర్శి శాంతకుమారి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.