ఒక్కటైన ఉపాధ్యాయులు

– టీఆర్‌టీయూ, తెలంగాణ పీఆర్‌టీయూ విలీనం
-తెలంగాణ భవన్ వేదికగా ముగిసిన కీలక ప్రక్రియ
– తదుపరి బాధ్యతలు కేసీఆర్‌కు అప్పగిస్తూ తీర్మానం

Kalvakuntla Kavitha in PRTU meeting
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఒకే గొడుగుకిందికి చేరారు. రెండు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (టీఆర్‌టీయూ), తెలంగాణ ప్రోగ్రెసివ్ ఉపాధ్యాయ సంఘం (టీపీఆర్టీయూ) విలీనమై ఒకే సంఘంగా ఏర్పాటై టీఆర్‌ఎస్ పార్టీకి అనుబంధంగా పని చేసేందుకు నిర్ణయించాయి. తెలంగాణ భవన్ వేదికగా ఆదివారం ఈ కీలక ఘట్టం చోటుచేసుకున్నది. తొలుత ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో రెండు సంఘాల రాష్ట్ర కార్యవర్గాలు వేర్వేరుగా సమావేశమై విలీన ప్రతిపాదనకు అనుకూలంగా ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించాయి. ఆ తర్వాత రెండు సంఘాల కార్యవర్గాలు ఒకే వేదికపై సమావేశమై విలీనంపై ఉమ్మడిగా మరో తీర్మానాన్ని ఆమోదించాయి.

నూతన సంఘం పేరు, సంఘం కార్యవర్గ ఏర్పాటు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. టీఆర్‌టీయూ తరపున ప్రధాన భూమిక పోషించేందుకు మునగాల మణిపాల్‌రెడ్డిని ప్రతినిధిగా ప్రతిపాదిస్తూ తీర్మానించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా, పీఆర్‌టీయూ అధ్యక్షుడు జీ హర్షవర్దన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాలస్వామి, టీఆర్‌టీయూ నాయకులు ఐ మణిపాల్‌రెడ్డి, ఇతర కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.

త్వరలోనే సర్వీస్ రూల్స్..
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న పదిహేను రోజుల్లో ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ వస్తాయని చెప్పారు. మన వ్యవస్థను మనమే బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులందరిపైనా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు ప్రభుత్వానికి అండగా నిలిచి, సహకరించాలన్నారు. ఉద్యమ కాలంనాటి నుంచీ కేసీఆర్ తెలంగాణ ఉపాధ్యాయసంఘాలు బలోపేతం కావాలని ఆశించారని ఆయన ఆశయాలకు అనుగుణంగానే తమ రెండు సంఘాలు విలీనమయ్యాయని టీఆర్‌టీయూ అధ్యక్షుడు మునగాల మణిపాల్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ భావజాలం, తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే ఆశయం ఉన్న ప్రతి ఒక్క సంఘం, ఉపాధ్యాయులకు నూతనంగా ఏర్పడనున్న సంఘంలోకి ఆహ్వానం పలుకుతామని చెప్పారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళతామన్నారు. ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలు… సర్వీస్ రూల్స్, ఇతరత్రా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

విలీనంతో విద్యా రంగానికి మేలు: కవిత
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో భావసారూప్యత ఉన్న రెండు ఉపాధ్యాయ సంఘాలు విలీనమవడం ఉపాధ్యాయులకే కాకుండా విద్యా రంగానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. మహోన్నత తెలంగాణ ఉద్యమంలో ముందుకు ఉరికింది విద్యార్థులైతే… వారిని తీర్చిదిద్దిన ఘనత ఉపాధ్యాయులదన్నారు. ఉపాధ్యాయులు గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మించారని ప్రశంసించారు. తెలంగాణ భావజాలంతో పని చేసేందుకు ఇంకా ఎన్ని సంఘాలు ముందుకొచ్చినా సంతోషంగా వారిని కూడా ఆహ్వానిస్తామన్నారు.

Public

చాలా సంఘాలు ముందుకొచ్చి రిప్రజెంట్ చేస్తున్నయి… మావాళ్లు ఇద్దరున్నరు… వాళ్ల గురించి ఆలోచించినం, మీ గురించి ఆలోచిస్తమన్నం… అని చెప్పారు. అందరినీ కల్పుకొని ముందుకుపోదాం… ఫైనల్‌గా కూర్చుని చర్చించుకుందాం అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, ఉపాధ్యాయుల మధ్య సానుకూల వాతావరణం ఉండాలని ప్రభుత్వం అభిలషిస్తుందని చెప్పారు. ఉపాధ్యాయులు స్వంత ప్రాంతంలో పనిచేసినపుడే విద్యార్థులకు మంచి బోధన అందుతుందని సూచించారు. ప్రభుత్వ ప్రధాన ఎజెండా విద్య, వైద్యమేనని అందువల్ల విద్యా రంగానికి భారీగా నిధులు అందుతాయని చెప్పారు. అన్నారు. విద్యారంగం పరిపుష్ఠానికి ఉపాధ్యాయ లోకం మంచి సూచనలివ్వాలని కోరారు. వీలైనంత త్వరలో నూతన సంఘానికి అన్ని వసతులతో కూడిన భవనాన్ని కూడా నిర్మించుకుందామని చెప్పారు.