నూతనోత్సాహంతో పనిచేయాలి

– నెలవారీగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలి
– కలెక్టర్ల సమావేశానికి పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలి
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్

KTR review with Rural water supply department

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల అధికారులు, ఉద్యోగులు నూతనోత్సాహంతో పనిచేయాలని మంత్రి కే తారక రామారావు పిలుపునిచ్చారు. మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖాధిపతులతో ఆయన సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని వివిధ అనుబంధ సంస్థల్లో జరిగిన కార్యక్రమాలు, పథకాలపై ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, పంచాయతీరాజ్ రోడ్ల బలోపేతం, ఆసరా పింఛన్లు, జాతీయ ఉపాధి హామీ పథకంపై ఆయా విభాగాల అధికారుల నుంచి మంత్రి కేటీఆర్ నివేదికలు తీసుకున్నారు.

ఈ నెల 9, 12వ తేదీల్లో జరిగే కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఏ అంశంపై సమాచారం అడిగినా అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పనులపై సమీక్షలో భాగంగా.. ఇంటేక్ వెల్స్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభమయ్యేలా చూడాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని, ఈ ప్రాజెక్టుపై కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశముందని తెలిపారు. నిధులను మిగిలించే ఉద్దేశంతో ఈపీపీ విధానాన్ని పక్కనబెట్టి, మొబిలైజేన్ అడ్వాన్సులు ఇవ్వకుండా పెద్ద ప్రాజెక్టు చేపట్టిన మొదటి ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా జరుగుతున్న పన్నుల వసూలు కార్యక్రమం వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఎన్నడూలేని విధంగా పన్నుల చెల్లింపు బాగా పెరిగిందని, ఇది త్వరలోనే మరింతగా పెరుగుతుందని పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ మంత్రికి వివరించారు. గతం కన్నా కనీసం 30 శాతం పన్నుల చెల్లింపులు పెరిగినట్లు ఆమె చెప్పారు. గ్రామ పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న పలు కార్యక్రమాల నివేదికలను కలెక్టర్ల సమావేశంలో అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు.

గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలు తమ ప్రాధాన్య అంశాలను సిద్ధం చేసి, కాలానుగుణంగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలని, వీటిని కలెక్టర్లకు అందించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. శాఖాపరంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తిచేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని, ఈ విషయంలో అలసత్వం వహించవద్దని పేర్కొన్నారు.

పంచాయతీరాజ్ రోడ్ల పనులను రాబోయే కాలానికి నెలవారీగా లక్ష్యాలు నిర్దేశించుకొని పూర్తిచేయాలని, ఈ మేరకు ఏ నెలకు ఎన్ని కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తారో తనకు షెడ్యూల్ ఇవ్వాలని పీఆర్ ఇంజినీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సాధించిన అభివృద్ధి నివేదికతో పాటు, చేపట్టాల్సిన పనులను కలెక్టర్లకు సూచించాలని కేటీఆర్ అధికారులకు చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య ప్రణాళికలు, ప్రాధాన్యాలను వివరిస్తూ ప్రత్యేక నోట్ తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. ఆసరా పింఛన్ల ప్రక్రియను సమీక్షించిన మంత్రి కేటీఆర్.. సెర్ప్ ద్వారా చేపట్టాల్సిన ఇతర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని, ఇందుకోసం చేపట్టాల్సిన చర్యలు, కార్యక్రమాలను సూచించాలని కోరారు.

అధికారులంతా కలెక్టర్ల సమావేశానికి సమగ్ర సమాచారం, ప్రాధాన్య అంశాల నివేదికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈవో మురళి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ బీ సురేందర్‌రెడ్డి, పీఆర్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.