నూతన ఆవిష్కరణలకు పోత్సాహం

-డిజిటల్ దిశగా ఐటీ రంగం రూపాంతరం
-పెగా డెవలపర్స్ వార్షికోత్సవ సదస్సులో మంత్రి కేటీఆర్

KTR in Pigo Developers summit

సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాల పోత్సాహాన్ని అందిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఆదివారం జరిగిన పెగా డెవలపర్స్‌సంస్థ ద్వితీయ వార్షికోత్స సదస్సును మంత్రి ముఖ్యఅతిథిగా ప్రారంభిస్తూ పెగా డెవలపర్స్ సంస్థ వరుసగా రెండో సంవత్సరం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం రాష్ర్టానికే గర్వకారణమన్నారు.

రాష్ట్రంతోపాటు దేశంలో ఉద్యోగాల సంఖ్య పెంచడంలో ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తుల కంపెనీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి కంపెనీలకు తమ ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని తెలిపారు. టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలకు రాష్ట్రం వేదికగా మారనుందన్నారు.ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుతో ప్రపంచవ్యాప్తంగా ఐదువేల కంపెనీలు నగరానికి రానున్నాయన్నా రు. కొత్త రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నిలిపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

పవరింగ్ ద డిజిటల్ ఎంటర్‌ప్రైజ్ అనే అంశంపై రెండురోజుల సదస్సు నిర్వహిస్తున్నట్టు పెగా సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుమన్‌రెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన దాదాపు 2500 మంది పెగా సిస్టమ్స్‌సంస్థ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెగా సిస్టమ్స్ వైస్‌ప్రెసిడెంట్ జాన్ బరోని, సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ కెరిమ్ అగొనల్, డాన్ షుర్‌మన్ తదితరులు పాల్గొన్నారు.