కరెంట్‌కోసం ధర్నాల్లేవ్

– త్వరలో రైతులకు 9 గంటలపాటు కరెంట్ ఇస్తాం
– వడగండ్లతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
– ప్రజలకే మేం జవాబుదారులం: మంత్రి కేటీఆర్

గత ప్రభుత్వాల పాలనలో ఎండాకాలం వచ్చిందనే నిత్యం కరెంటు కోసం విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడి, ధర్నాలు ఉండేవి. స్వరాష్ట్రలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆందోళనలు అసలే లేవు. గుంట పొలం ఎండిపోకుండా ప్రస్తుతం ఆరుగంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నాం. ఐదేండ్లలో రూ.91 వేల కోట్లతో 24 వేల మెగావాట్ల మిగులువిద్యుత్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. త్వరలో రైతులకు 9గంటలపాటు కరెంట్ అందించేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు.

IT-and-Panchayat-Raj-Minister-KT-Ramarao-at-sirisilla

మరమగ్గాల పరిశ్రమలకు కూడా నిరంతరం కరెంటు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో సోమవారం ఆయన పర్యటించారు. సిరిసిల్లలో రైతులకు సబ్సీడీపై ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు అందజేశారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో అభివృద్ధి పనులకు భూమిపూజ, శంకుస్థాపన చేసి సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఆయన మాట్లాడుతూ వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, దిగాలు చెందవద్దని భరోసా ఇచ్చారు. అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందిస్తున్నారని, నివేదికలు రాగానే చర్యలు చేపడుతామన్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాజకీయాలకతీతంగా, పారదర్శకంగా సబ్సీడీపై వ్యవసాయపనిముట్లను అందిస్తున్నామన్నారు.

రూ.17వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక చేస్తున్న విమర్శలను పట్టించుకోవద్దని సూచించారు. ఓట్లేసి గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకే జవాబుదారులం తప్ప, పనిలేక.. పసలేని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు కాదన్నారు. ప్రతిపక్షపార్టీలు 60 ఏండ్లుగా మోసాలు చేశాయని, వాళ్ల విమర్శలను నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు.