నిరుద్యోగులు నిరాశ చెందొద్దు

– ఎన్నికల హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
-ఏడాదిలోపు మెదక్‌లో సాగుకు సింగూరు జలాలు
-పనులు ఆలస్యం చేస్తే కాంట్రాక్టులను రద్దు చేస్తాం
-భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక

Harish Rao

ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీమేరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరించినంత మాత్రాన నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు ప్రభుత్వం కృషిచేస్తుందని చెప్పారు. ఎన్నో ఏండ్లుగా తక్కువ వేతనాలు తీసుకుంటూ కాంట్రాక్టు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, రాష్ట్ర ఏర్పాటులో వారి పాత్ర చాలా ఉందన్నారు.

సోమవారం మెదక్ జిల్లా పుల్‌కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన మంత్రి కుడి,ఎడమ కాల్వల పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మెదక్ జిల్లాలో సింగూర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ రైతాంగానికి సాగునీరు అందలేదన్నారు. ఎనిమిదేండ్ల క్రితం కాల్వ నిర్మాణ పనులకు నిధులు మంజూరైనప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పనులుచేపట్టని, నత్తనడకన పనులు చేస్తున్న కాంట్రాక్టులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఏడాదిలోగా అంటే కాల్వ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

ఈ ఏడాది డిసెంబర్‌లోగా స్థానికచెరువులు, కుంటలు నింపి దాదాపు 10 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని ఆదేశించారు. సాగునీటి రంగపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిదని, అన్ని సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యే బాబుమోహన్ మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులు ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా వ్యవహారించారని, ఇకమీదట ఊరుకోబోమని హెచ్చరించారు. అంతకుముందు మంత్రి పుల్‌కల్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సింగూర్ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.