నిలకడగా మంత్రి ఈటల ఆరోగ్యం

-పార్టీలకతీతంగా పరామర్శల వెల్లువ

Kalvkauntla Kavitha met Minister Etala Rajendar and enquired about his health condition

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సికింద్రాబాద్ యశోద దవాఖానలో మంత్రి ఈటల రాజేందర్‌కు డాక్టర్ సురేశ్ నేతృత్వంలోని వైద్యులబృందం చికిత్స అంది స్తున్నది. శనివారం మంత్రి ఈటల కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురికావడంతో.. ప్రాథమిక చికిత్స అనంతరం సికింద్రాబాద్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈటల ఆదివారం తీవ్రమైన ఒంటినొప్పులతో బాధ పడినట్లు వైద్యులు చెప్పారు. ఆయన ఎడమ కాలి మోకాలిచిప్ప పక్కకు జరిగినట్లు గుర్తించిన వైద్యులు కాలుకు కట్టుకట్టారు. దీంతో ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. ఆదివారం ఉదయానికి మోకాలి వద్ద కొద్దిపాటి వాపు రావడంతో.. పరీక్షలు నిర్వహించగా అన్ని రిపోర్టులు నార్మల్‌గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సోమవారం మరోసారి ఎంఆర్‌ఐ తీస్తామని చెప్పారు. ఆదివారం ఉదయం నుంచి తీవ్రమైన ఒంటినొప్పులు ఉండటంతో ఆ మేరకు చికిత్స అందిస్తున్నారు.

ఫోన్‌లో పరామర్శించిన గవర్నర్, వెంకయ్య
మంత్రి ఈటల రాజేందర్‌ను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, స్పీకర్ మధుసూధనాచారి, దుబాయ్‌లో ఉన్న టీజేఏసీ చైర్మన్ కోదండరాం, కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య కూడా ఫోన్‌లో మంత్రిని పరామర్శించారు.

పార్టీలకతీతంగా పరామర్శల వెల్లువ
ఆదివారం ఈటలను పరామర్శించిన వారిలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, తుమ్మల, జూపల్లి, అల్లోల, చందూలా ల్, ఎంపీలు కే కేశవరావు, బాల్క సుమన్, వీహెచ్ మాజీ ఎంపీలు మందా జగన్నాథం, పొన్నం, వివేక్, రాజయ్య ఉన్నారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, రమేష్, ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, కనకారెడ్డి, బాలరాజ్, ఆలె వెంకటేశ్వర్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే గోపినాథ్ బీజేపీ ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు నాగం, లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పరామర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, సలీం, కర్నె ప్రభాకర్, రాంచందర్‌రావు, జెడ్పీ చైర్మన్ తుల ఉమ, సీఎస్ రాజీవ్‌శర్మ, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, నోముల, ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, నమస్తే తెలగాణ సీఎండీ దివికొండ దామోదరరావు, మెట్రో ఇండియా ఎడిటర్ సీఎల్ రాజం, మాజీ ఎమ్మెల్సీ భానుప్రసాద్, నారదాసు లక్ష్మణరావు, టీఆర్‌ఎస్ నేత మైనంపల్లి, ఎర్రొళ్ల శ్రీనివాస్, గజ్జెల నగేశ్ పరామర్శించిన వారిలో ఉన్నారు.

కంటతడిపెట్టిన కేసీఆర్ సతీమణి శోభ
సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న మంత్రి ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సతీమణి శోభ ఆదివారం పరామర్శించారు. కాలుకు కట్టుతో.. ఒంటినొప్పులతో బాధపడుతున్న మంత్రి ఈటల రాజేందర్‌ను చూసి ఆమె కంటతడి పెట్టారు. దీంతో ఈటల కూడా తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. నిజామాబాద్ ఎంపీ కవిత కూడా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

సల్లంగుండాలె
పురుగులన్నంతో
కలబడ్డవాడు
సంక్షేమం అర్థం
ఎరుకైనోడు
బక్కచిక్కినోళ్లకు
అండైన బక్కోడు
కడుపున చల్లలాంటోడు
సన్నబియ్యం పెట్టినోడు సల్లంగుండాలె
-జూలూరు గౌరిశంకర్
(మంత్రి ఈటల రాజేందర్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన నేపథ్యంలో కవి జూలూరు గౌరిశంకర్ రాసిన కవిత)