నేతన్నకు చేయూత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘నేతన్నకు చేయూత’ అనే పొదుపు పథకానికి శ్రీకారం చుట్టింది. భూదాన్ పోచంపల్లి వేదికగా మంత్రి కేటీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పథకాన్ని ప్రారంభించారు. పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, జగదీష్ రెడ్డి, జోగు రామన్న, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, వేముల వీరేశం, పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిశోర్‌, ఎమ్మెల్సీ పూలరవీందర్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

‘నేతన్నకు చేయూత’కు రూ. 75 కోట్లు కేటాయింపు : కేటీఆర్
రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పోచంపల్లి నుంచి నేతన్నకు చేయూత పథకం ప్రారంభించడం సంతోషాన్ని కల్గిస్తుందన్నారు మంత్రి. పోచంపల్లి చేనేత కళాకారులకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ పథకాన్ని పోచంపల్లి నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. నేతన్నల కష్టాలు సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు. చేనేత రంగంపై సీఎం కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉందన్నారు.
పథకం వివరాలు

-18 ఏళ్లు నిండిన చేనేత కార్మికులు(వీవర్స్, డైయర్స్, వెండర్స్, వార్పర్స్, సహాయ వీవర్స్) అందరూ ఈ పథకానికి అర్హులు.
-లబ్ధిదారుని వాటాగా వేతనంలో 8 శాతం పొదుపు పథకంలో జమ చేయాలి, ప్రభుత్వ వాటా 16 శాతం జమ చేయబడుతుంది(గరిష్టంగా రూ. 2,400ల వరకు జమ చేయబడుతుంది).
-నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, సంబంధిత సహాయ సంచాలకుల వారికి సమర్పించాలి.
-లబ్ధిదారుడు ప్రకటించిన నెలసరి వేతనంలో 8 శాతం ఆర్.డి-1 ఖాతాలో ప్రతి నెల 15వ తేదీలోగా జమ చేయాలి. ప్రభుత్వ వాటా 16 శాతం ఆర్.డి-2 ఖాతాలో జమ చేయబడుతుంది.
-36 నెలల(3సంవత్సరాలు) తర్వాత ఆర్.డి-1 మరియు ఆర్.డి-2 ఖాతాల్లో జమ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి తీసుకోవచ్చు.
-తెలంగాణలో చేనేత వృత్తిపై ప్రత్యక్షంగా పని చేస్తున్న నేతన్నలందరికీ ఈ పథకం ద్వారా భవిష్యత్‌కు భద్రత కలుగుతుంది