నేడు సుభోజనం పథకం ప్రారంభం

-బోయినపల్లి మార్కెట్‌యార్డులో ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు

Harish Rao
రాష్ట్ర వ్యవసాయర్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సుభోజనం పథకాన్ని మార్కెటింగ్ శాఖ మంత్రి టీ హరీశ్‌రావు శుక్రవారం బోయినపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్కెట్‌లో ప్రారంభించనున్నారు. మార్కెట్ యార్డుల్లో పని చేసే కార్మికులు, హమాలీలతోపాటు మార్కెట్‌కు వచ్చే రైతులకు నాణ్యమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ టీఆర్‌ఎస్ పార్టీ ఈ అంశాన్ని చేర్చింది. ఈ పథకం కింద మార్కెట్ యార్డుల్లో మినరల్ వాటర్‌తోపాటు రూ.ఐదుకే భోజనం, రూ.2కే అల్పాహారం అందించనున్నారు.

రైతులు, కార్మికుల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రంలోని అన్ని మార్కెట్‌యార్డుల్లో దశలవారీగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. మలక్‌పేట మార్కెట్‌యార్డులో ఇప్పటికే రైతు విశ్రాంతి గదులకు మరమ్మతులు చేయించి మౌలిక వసతులు కల్పించారు. వీటిని కూడా మంత్రి ప్రారంభిస్తారు. సుభోజన పథకం ప్రారంభకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ హాజరవుతున్నారు. ఆబ్కారీశాఖ మంత్రి టీ పద్మారావు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ బీ జనార్దన్‌రెడ్డి, ఇతర మార్కెటింగ్ శాఖ అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారు.