నేడు పారిశ్రామిక సంస్ధలతో సీఎంభేటీ

-హాజరవుతున్న 50కి పైగా సంఘాల ప్రతినిధులు
-పారిశ్రామిక విధానంపై అభిప్రాయ సేకరణ
-విధాన రూపకల్పనకు కీలక కసరత్తు
-హైదరాబాద్-వరంగల్ కారిడార్‌పైనా చర్చ

KCR

రాష్ట్ర పారిశ్రామిక విధాన ప్రకటనకు జరుగుతున్న కసరత్తులో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం వివిధ పారిశ్రామిక సంఘాలు, సమాఖ్యల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం ప్రకటించాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. విధాన రూపకల్పనలో పారిశ్రామికవేత్తల, సంఘాల అభిప్రాయ సేకరణకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన యోచిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి 50కి పైగా సంస్థలు, సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు.

ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పారిశ్రామికవేత్తల నుంచి అభిప్రాయాలు, సూచనలను స్వీకరిస్తారు. పారిశ్రామిక విధాన రూపకల్పనలో ఈ అభిప్రాయాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తారు. సీఐఐ, ఫ్యాప్సీ, ఫిక్కి, అసోచాం, డిక్కి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య, ఎలీప్ వంటి సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. సమావేశంలో నూతన పారిశ్రామిక విధానం, పరిశ్రమల స్థాపనకు 15 రోజుల్లో అనుమతి, సింగిల్ విండో విధానం, రాయితీలు, ప్రోత్సాహకాలు, భూ కేటాయింపులు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

అలాగే హైదరాబాద్- వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలు, మౌలిక సదుపాయాల కల్పన, అక్కడ ఏర్పాటు చేయదగిన పరిశ్రమలపై పారిశ్రామికవేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. ఈ సమావేశంలో ముందుగా పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి సీఎం కేసీఆర్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌చంద్ర ప్రసంగిస్తారు. ఒక్కో పారిశ్రామిక వేత్త తన అభిప్రాయాలు తెలిపేందుకు సమావేశంలో ఐదు నిమిషాలు అవకాశం కల్పిస్తారు. సమయం ఉంటే పారిశ్రామిక వేత్తలు తాము రూపొందించిన డాక్యుమెంట్లను కూడా ప్రభుత్వం స్వీకరించే అవకాశముంది. ఇదే అంశంపై సోమవారం పలువురు పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు సచివాలయంలో సీఎంను కలిసారు.