నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం పర్యటన

-రెండు పరిశ్రమలకు ప్రారంభోత్సవం..
-మరో కంపెనీకి శంకుస్థాపన

KCR 0002
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రైవేటు పరిశ్రమలనూ ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో నిర్మించిన ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ హోంప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ పరిశ్రమను, అడ్డాకుల మండలం వేములలో ఏర్పాటుచేసిన కోజెంట్ గ్లాస్ లిమిటెడ్ కంపెనీని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.

పెంజర్లలో 170 ఎకరాల విస్తీర్ణంలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం పరిశ్రమల శాఖ, టీఎస్‌ఐఐసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, సచివాలయంలో బుధవారం పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర అధ్యక్షతన ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న పరిశ్రమలు, టీఎస్‌ఐఐసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్థికమండలి స్థితిగతులు, సమస్యలు, కోర్టు కేసులు వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం.

పాలమూరులో విస్తృత ఏర్పాట్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న అడ్డాకుల మండలం వేముల గ్రామశివారులోని కోజెంట్ మల్టీరోబోటిక్ గ్లాస్ తయారీ పరిశ్రమను బుధవారం ఉదయం డీఐజీ టీవీ శశిధర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రియదర్శిని, జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, ఏజేసీ రాజారాం, ఏఎస్పీ మల్లారెడ్డి, వనపర్తి డీఎస్పీ చెన్నయ్య, ఇంటెలిజెన్స్ డీఎస్పీ లావణ్య, ఎస్బీ డీఎస్పీ రామేశ్వర్, నాగర్‌కర్నూల్ ఆర్డీవో వీరారెడ్డి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

ఇదీ సీఎం షెడ్యూల్: ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు హెలికాప్టర్‌లో బయలుదేరి 1.30గంటలకు అడ్డాకుల మండలంలోని వేముల గ్రామశివారులో గల కోజంట్ గ్లాస్ పరిశ్రమను ప్రారంభిస్తారు. 3.30గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కొత్తూర్ మండలంలోని పెంజర్ల గ్రామశివారులో గల ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ పరిశ్రమవద్దకు 3.45గంటలకు చేరుకొని పరిశ్రమను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 4.45గంటలకు బయలుదేరి అదే గ్రామశివారులో జాన్సన్ అండ్ జాన్సన్ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి 5.25 గంటలకు బయలుదేరి 5.55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.