నేడు కీలక భేటీ

-మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం
-ఎన్నికల ఫలితాలు.. పార్టీ విజయావకాశాలపై చర్చ!
-రాష్ట్ర విభజన పరిణామాలపై కూడా చర్చించే అవకాశం
-హాజరుకానున్న పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు

KCR 001

టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరుగనుంది. పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులంతా పాల్గొననున్నారు.

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలతోపాటు పలు అంశాలపై విస్తతంగా చర్చించనున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాలవారీగా పార్టీ విజయావకాశాలపై అభ్యర్థుల నుంచి సమాచారం సేకరించనున్నారు. జిల్లాలవారీగా రూపొందించిన పూర్తిస్థాయి నివేదికలపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నట్లు తెలిసింది. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో మొదటిసారి ఒంటరిగా పోటీచేసిన టీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి లభించిన ఆదరణను ఈ సమావేశంలో విశ్లేషించనున్నారు. దీంతోపాటు సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయావకాశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు గెలిచి తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని ధీమాగా ఉన్న టీఆర్‌ఎస్ నేతలు, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను దక్కించుకోవటంపై కూడా సమాలోచనలు జరుపనున్నారని సమాచారం. తెలంగాణలోని తొమ్మిది జెడ్పీ చైర్మన్ పదవుల్లో సింహభాగం సొంతం చేసుకోగలిగితే ఇక టీఆర్‌ఎస్‌కు ఏ స్థాయిలోనూ ఎదురుండదని ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. ఈ నెల 12,13 తేదీల్లో ఈ ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో విజయం సాధించే అభ్యర్థులను చైర్మన్ ఎన్నికలు పూర్తయ్యేవరకు కాపాడుకోవటంపై కూడా చర్చించే అవకాశం ఉంది.

అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది తామే కాబట్టి స్థానిక ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులు ఇతర పార్టీలవైపు చూసే అవకాశమే ఉండదని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. వీటితోపాటు రాష్ట్ర విభజనలో భాగంగా ఉద్యోగుల విభజనకు ఆప్షన్లు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరుగకుండా అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.