నేడు కేసీఆర్ నామినేషన్

-ఉదయం 10.30 మెదక్ ఎంపీకి
-మధ్యాహ్నం 12.30 గజ్వేల్ ఎమ్మెల్యే స్థానానికి
-12 నుంచి ప్రచారరంగంలోకి కేసీఆర్

Chandra Sekhar Rao
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు బుధవారం మెదక్ పార్లమెంట్, గజ్వేల్ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్లు వేసే ముందు ఆయన సిద్దిపేట నియోజకవర్గలోని నంగునూరు మండలంలో ఉన్న కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం 8.15నిమిషాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా సంగారెడ్డి చేరుకొని ఉదయం 10.30 గంటలకు మెదక్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తారు. తర్వాత గజ్వేల్‌కు వెళ్లి మధ్యాహ్నం 12.30గంటలకు అసెంబ్లీ సీటుకు నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పోటీ చేస్తున్న నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో సాయంత్రం 5.30కి నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా హైదారాబాద్ చేరుకుంటారు.

35 బహిరంగ సభలో భారీ ప్రచార వ్యూహం
సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాలని కృతనిశ్చయంతో ఉన్న టీఆర్‌ఎస్, అందుకోసం భారీ ప్రచార వ్యూహాన్ని రూపొందించింది. ఓటర్లకు చేరువయ్యేందుకు తెలంగాణ వ్యాప్తంగా 35 బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రతి మూడు నియోజకవర్గాలను కలుపుతూ ఒక బహిరంగ సభ నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతిరోజు మూడు బహిరంగ సభలు, మూడు రోడ్‌షోలు ఉండేలా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. బుధవారం హుజూర్‌నగర్ బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతారు. ఆ తరువాత 10, 11 తేదీల్లో బహిరంగ సభల నిర్వహణ, ప్రచార వ్యూహాలు, ఆకట్టుకునే ప్రసంగాలు, ఇతర అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు.

10, 11 తేదీల్లో ఏదో ఒకరోజు హోలోగ్రాఫిక్ టెక్నాలజీతో నిర్వహించే సభల తీరుపై మీడియాకు అవగాహన కల్పించనున్నారు. 12వ తేదీ నుండి కేసీఆర్ ప్రచార రంగంలోకి దూకనున్నారు. 12న ఉదయం నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో మొదటి బహిరంగ నిర్వహిస్తారు. అక్కడి నుండి హెలికాప్టర్‌లో కరీంనగర్‌కు చేరుకుని అక్కడ సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు. 13న ఉదయం చేవెళ్లలో, సాయంత్రం నల్గొండ జిల్లాలో నిర్వహించే సభల్లో పాల్గొంటారు.