నేడు ఢిల్లీకి కేసీఆర్

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన వెంట ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డి, వరంగల్ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు పీ సుదర్శన్‌రెడ్డి కూడా వెళ్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా తరలింపు అంశం, తెలంగాణకు సైనిక్ స్కూల్ ఏర్పాటు, స్మార్ట్ సిటీలు, విభజన చట్టంలో అమలుకాని అంశాలపై సంబంధిత కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. సీఎం ఢిల్లీ షెడ్యూల్ ఇలా ఉంది. బుధవారం రాత్రి 7 గంటలకు ఢిల్లీకి చేరుకుని ఎంపీలతో సమావేశమవుతారు. గురువారం మధ్యాహ్నం కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌తో భేటీ అవుతారు.

KCR

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను మరో ప్రాంతానికి తరలించే అంశంపై ఆయనతో చర్చిస్తారు. గతంలో శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ నగరం విస్తరించడంతో ప్రస్తుతం నగరం మధ్యకు చేరింది. దీనితో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాలను కేంద్ర రక్షణ మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్తారు. కేంద్రం అనుమతిస్తే కంటోన్మెంట్ మరో చోటకు తరలింపునకు అవసరమైన ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని స్పష్టం చేయనున్నారు. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైనిక్‌స్కూల్ ఏర్పాటు విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించి, ఈసారి వరంగల్‌కు సైనిక్‌స్కూల్ మంజూరు చేయాలని కోరనున్నారు.

గురువారం పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలుసుకునే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014కింద ఇంకా అమలుకు నోచుకోని అంశాలపై ఆయనతో చర్చించాలని భావిస్తున్నారు. గురువారం సాయంత్రం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడును ఆయన నివాసానికి వెళ్ళి కలుసుకుంటారు. తెలంగాణలో స్మార్ట్‌సిటీ, స్వచ్చ్‌భారత్ అంశాలపై చర్చిస్తారు.