నేడు ఢిల్లీకి కేసీఆర్

-ప్రధాని ఆధ్వర్యంలో సీఎంల సమావేశం
-ప్రణాళికాసంఘం స్థానంలో కొత్త వ్యవస్థపై చర్చించనున్న వివిధ రాష్ర్టాల సీఎంలు
-మూడు రోజులు హస్తినలోనే సీఎం

KCR 06
ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరయ్యే నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకుంటున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం చేయనున్న కేసీఆర్.. ప్లానింగ్ కమిషన్ స్థానంలో కొత్త వ్యవస్థను తీసుకొచ్చే విషయమై అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడిస్తారు. కేసీఆర్‌తో పాటు స్పీకర్ మధుసూధనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కూడా వస్తున్నట్లు సమాచారం. సుమారు నాలుగు గంటల పాటు జరిగే సీఎంల సమావేశంలో ప్లానింగ్ కమిషన్ స్థానంలో కొత్తగా ప్రాణం పోసుకోనున్న వ్యవస్థ పేరు ఎలా ఉండాలి? దాని కర్తవ్యాలు, లక్ష్యం ఏమిటి? కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలి? ఆర్థికాభివృద్ధికి ఐదేండ్ల వ్యూహం ఎలా ఉండాలి? ఇలా అనేక అంశాలపై చర్చ జరగనుంది.
ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని రాష్ర్టాల సీఎంలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలి? ఇప్పుడున్న పరిస్థితిపై ఎలాంటి అభిప్రాయం ఉంది? కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సహకారాన్ని కోరుకుంటున్నాయి? అనే అంశాలపైనా చర్చ జరుగనుంది. ప్రతి ఏటా కేంద్రం నుంచి వివిధ సంక్షేమ పథకాల కోసం అన్ని రాష్ర్టాలకు సుమారు రూ. 3 లక్షల కోట్ల మేరకు నిధులు అందుతున్నాయి కాబట్టి ఇకపైన ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాయి? తదితరాలన్నీ కూడా ఈ సమావేశంలోని అంశాలుగా ఉండబోతున్నట్లు సమాచారం. ప్రణాళికాసంఘం స్థానంలో తీసుకురాబోయే వ్యవస్థ చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లుగా ఏ రంగాలకు చెందనివారిని నియమించాలనే అంశంపైనా సమావేశంలో ఒక అంచనాకు రానున్నారు.

కేంద్ర మంత్రులను కలువనున్న సీఎం
ప్రధానితో జరిగే సమావేశం అనంతరం ఒక రోజు ఢిల్లీలోనే ఉండే కేసీఆర్.. పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశమున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తిన ఇబ్బందులను ఈ సందర్భంగా కేంద్ర మంత్రులకు ఆయన వివరించే అవకాశం ఉంది. ఈ క్రమంలో మోదీతోపాటు కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, పీయూష్‌గోయల్, ఉమాభారతి తదితరులను ఆయన కలుస్తారని సమాచారం. విభజన చట్టం ప్రకారం రాష్ర్టానికి రావాల్సిన విద్యుత్ వాటా విషయంలో ఎదురవుతున్న సమస్యలు, ఏపీ ప్రభుత్వ ఉల్లంఘనలను కూడా ఈ సందర్భంగా కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్తారని తెలుస్తున్నది.