నేడు దీక్షా దివస్

నవంబర్ 29.. అరవై ఏండ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పినదీ రోజు. ఓ వ్యక్తి సంకల్పం నాలుగుకోట్ల మందిని ఆవహించి శివమెత్తించిన సందర్భం. భూమ్మీద అనేక ఉద్యమాలు పుట్టి ఉండొచ్చు. కానీ గమ్యాన్ని ముద్దాడినవి అతిస్వల్పం. పీడనను.. దోపిడీని బలిదానాలతో ఎదురొడ్డి పునీతమైన చరిత్ర తెలంగాణ ఉద్యమానిది. తుఫాన్లను ఢీకొట్టి, కాలానికి ఎదురీది, అగ్నిపరీక్షలు తట్టుకుని నిలిచి గెలిచిన ఖ్యాతి ఉద్యమనేత కేసీఆర్‌ది! కేసీఆర్ సాహసమే దీక్షాదివస్.

KCR-Hunger-Strike

పార్లమెంట్‌లో రెండే స్థానాలు.. ఢీకొడుతున్నది మహాపర్వతం వంటి భారత రాజకీయవ్యవస్థను. తెలంగాణ జెండా ఎత్తిన రోజే భయాన్ని పాతిపెట్టిన కేసీఆర్.. ఈసారి ఏకంగా కేంద్రం నుంచి తెలంగాణ ప్రకటననే కలగన్నారు. ఆ స్వప్న సాకారానికి ప్రాణాన్నే పావుగా ఒడ్డారు. సిద్దిపేటను కార్యక్షేత్రంగా ఎన్నుకుని 2009లో నవంబర్ 29న కరీంనగర్ నుంచి సిద్దిపేటకు బయల్దేరిన కేసీఆర్‌ను అల్గునూరు చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు.
కేసీఆర్ అరెస్టువార్తతో శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకోగా యూనివర్సిటీలు భగ్గుమన్నాయి. బంద్‌లతో తెలంగాణ హోరెత్తింది. డిసెంబర్ 1న నేను లేకున్నా ఉద్యమం నడవాలి అని కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్ 2న పార్లమెంట్‌లో అద్వానీ ఈ దీక్షను ప్రస్తావించారు. 3న కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. 4న తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్రని కేసీఆర్ ప్రకటించారు. 5న వెంకటస్వామి, చిరంజీవి, చంద్రబాబు, కాంగ్రెస్ ఎంపీలు కలిసి దీక్ష విరమించాలని కోరినా కేసీఆర్ నిరాకరించారు. 6న అసెంబ్లీలో 14ఎఫ్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశారు.

డిసెంబర్ 7న అప్పటి సీఎం అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్నిపార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. డిసెంబర్ 8న తెలంగాణ దిశగా సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ కోర్‌కమిటీ ఐదుసార్లు సమావేశమైంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన చేయాలని చిదంబరానికి సోనియా సూచించారు. కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించామని ప్రకటన చేశారు. 11 రోజుల దీక్ష గమ్యాన్ని ముద్దాడింది. కేసీఆర్ ఆమరణ దీక్ష విరమించారు.