నేడు చైనాకు సీఎం కేసీఆర్

రాష్ర్టానికి భారీ ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించి ప్రపంచపటంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 10 రోజుల చైనా పర్యటనకోసం సోమవారం బయలుదేరి వెళ్తున్నారు. చైనాలోని డాలియన్ నగరంలో ఈ నెల 9నుంచి 11వరకు న్యూ చాంపియన్‌షిప్-2015 పేరిట జరుగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్న మానవ, ప్రకృతి వనరులను ప్రపంచం ముందుంచనున్నారు.

KCR

-శంషాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో..
– పది రోజుల పర్యటనలో బిజీబిజీగా గడుపనున్న సీఎం
– 9న డాలియన్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ప్రసంగం
– ఐదు నగరాల్లో పర్యటన.. పారిశ్రామిక పార్కుల సందర్శన
– చైనా పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశాలు
– రాష్ట్రంలో పెట్టుబడులపై పలు ఒప్పందాలకు అవకాశం
-16వ తేదీన తిరిగి హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్
ప్రపంచం నలుమూలల నుంచి ఈ సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలకు తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని వివరించి, పరిశ్రమల స్థాపనకు కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సౌకర్యాల గురించి తెలియజేస్తారు. సీఎం చైనా పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం ఉదయం 10గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో చైనా బయలుదేరి వెళ్తారు. విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు వీడ్కోలు పలుకుతారు. సీఎం వెంట వేర్వేరు విమానాల్లో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, పారిశ్రామిక ప్రముఖులు కూడా వెళ్తున్నారు. చైనాలో సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, టీఎస్‌ఐఐసీ వీసీ అండ్ ఎండీ నరసింహారెడ్డి శనివారమే బయలుదేరి వెళ్లారు.

ఎమర్జింగ్ మార్కెట్ ఎట్ క్రాస్‌రోడ్స్‌పై చర్చ
9వ తేదీన ప్రారంభమయ్యే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ఎమర్జింగ్ మార్కెట్ ఎట్ క్రాస్‌రోడ్స్ అనే అంశంపై జరిగే చర్చలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఎమర్జింగ్ మార్కెట్ల అభివృద్ధికిగల అవకాశాలపై ఇందులో చర్చిస్తారు. ఆ దిశగా ఉన్న ఆటంకాలు, విధానపరలోపాలతో పాటు, దక్షిణాసియాలో వాణిజ్యం- పెట్టుబడుల భాగ స్వామ్యం తదితర అంశాలపై దృష్టి సారిస్తారు. సీఎంతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన ఆరిఫ్ ఎం నఖ్వీ, సింగపూర్‌కు చెందిన కెవిన్‌లూ, బ్రెజిల్‌కు చెందిన మార్కోస్ వినిక్లస్ డిసౌజాలు కూడా చర్చలో పాల్గొంటారు.

పలు కంపెనీల సందర్శన
చైనాలోని పారిశ్రామికవాడలు, ఎలక్ట్రికల్ పరికరాల తయారీ కంపెనీలను కేసీఆర్ సందర్శిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న అంతర్జాతీయ సంస్థలతో ఈ పర్యటనలో ఒప్పందాలు కుదుర్చుకొనే అవకాశాలున్నాయి. షాంఘై, బీజింగ్, షెంగ్‌వాన్ నగరాల్లోని పారిశ్రామికవాడలను సీఎం బృందం సందర్శిస్తుందని అధికారవర్గాలు తెలిపాయి. షెంగ్‌వాన్‌లో పారిశ్రామిక ప్రతినిధులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకుగల అవకాశాలు, టీఎస్‌ఐపాస్ ప్రత్యేకతలు వివరిస్తారు. అలాగే చెంగ్డూ నగరంలోని డాంగ్‌ఫెంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ యూనిట్‌ను సీఎం సందర్శిస్తారు. ఆ కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి తమ యూనిట్‌ను సందర్శించాలని సీఎంను కోరారు.

సీఎం టూర్ షెడ్యూల్ ఇది
-వాస్తవంగా చైనా పర్యటనకు 8వ తేదీనే బయలుదేరాల్సి ఉండగా, వ్యాపారవేత్తలతో ఒకరోజు ముందుగా సమావేశం కావడం కోసం షెడ్యూల్‌ను మార్చారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి సీఎం చైనాకు బయలుదేరి రాత్రి 8 గంటలకు డాలియన్ నగరానికి చేరుకొంటారు. రాత్రి 9 గంటలవరకు డాలియన్ సిటీలోని షాంగ్రిల్లా హోటల్‌కు చేరతారు. ఆ రాత్రి అక్కడే సీఎం బస చేస్తారు.
-8న స్థానిక ప్రముఖులతో సీఎం మాట్లాడే అవకాశం ఉంది. రాత్రి 8 గంటల నుంచి 8.30 గంటల వరకు భారతీయ పారిశ్రామికవేత్తలతో కలిసి డిన్నర్ చేస్తారు.
-10వ తేదీన డాలియన్ నుంచి షాంఘై చేరుకుంటారు. నగరంలోని మారియట్ హోటల్ సిటీ సెంటర్‌లో బస చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకును సందర్శిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు చైనా పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున చైనా పారిశ్రామికవేత్తలకు విందు ఇస్తారు.
-11వ తదీన షాంఘైలోని సొఝు పారిశ్రామిక పార్క్‌లో సీఎం పర్యటిస్తారు. అక్కడే స్థానిక పారిశ్రామికవేత్తలతో కలిసి భోజనం చేస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు బీజింగ్ నగరం చేరుకొని రఫెల్స్ హోటల్‌లో బస చేస్తారు. అదే హోటల్ చైనాలో భారత రాయబారి ఇచ్చే విందులో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు.

-12వ తేదీన ఉదయం 10 నుంచి 10.25 గంటలవరకు చైనా రైల్వే కార్పొరేషన్ ప్రతినిధులతో సీఎం సమావేశమవుతారు. 10.30 గంటల నుంచి 10.55 గంటలవరకు చాంగ్‌క్వింగ్ ఇంటర్నేషనల్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (సీఐసీవో) ప్రతినిధులతో సమావేశమవుతారు. 11గంటల నుంచి 11.45 వరకు ఇన్స్‌పూర్ గ్రూప్‌తో, మధ్యాహ్నం 12.35 నుంచి ఒంటిగంట వరకు గ్రీన్‌సిటీ ఈ-3 లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సాని సంస్థ ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమవుతారు.
-13న చైనా మహాకుడ్యాన్ని సీఎం సందర్శిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు షెంజన్‌కు చేరుకుంటారు.
-14వ తేదీన ఉదయం 11.30 గంటలకు షెంజన్ (ఇండస్ట్రియల్) హైటెక్ పార్క్‌కు చేరుకొని సాయంత్రం 4గంటలవరకు అక్కడి పరిశ్రమలను పరిశీలించి స్థానిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడతారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు హాంకాంగ్ చేరుకుంటారు.
-15వ తేదీన ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రినాయిసెన్స్ హోటల్‌లో పారిశ్రామికవేత్తలతో సమావేశమై అక్కడే భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్నేషనల్ కామర్స్ సెంటర్‌కు చేరుకొని అక్కడి స్కై 100 అబ్జర్వేషన్ డెక్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 3.15 గంటలకు లాంగ్టావ్‌లోని బిగ్ బుద్ధను సందర్శిస్తారు. తిరిగి రాత్రి 7 గంటలకు భారత రాయబారి ఇచ్చే విందులో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
-16వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు హాంకాంగ్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.

కేసీఆర్‌ వెంట ఉన్నతస్థాయి బృందం
చైనా పర్యటనకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెంట రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, జీ జగదీశ్‌రెడ్డి, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాశ్‌రెడ్డి,సంతోశ్‌కుమార్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఐజీ భగవత్ మహేశ్‌మురళీధర్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, మిషన్ మేనేజర్లు జగదీశ్ రామడుగు, శివాని శంకర్ (సీవీఎస్)లతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు వెళ్లనున్నారు.