నాయకుడు.. సమన్వయకర్త!

ముందు వరుసలో తను నిలబడి.. వెంట నలుగురినీ నడిపించడం నాయకత్వ లక్షణం! కేసీఆర్ విషయంలో రాష్ట్ర సాధన ఉద్యమం దాన్ని ఆ విషయాన్ని ఎప్పుడో గమనించింది! ఇప్పుడు బంగారు తెలంగాణ లక్ష్యాన్నిపెట్టుకున్న గులాబీ దళపతి.. అందుకు తన జట్టును పరిపూర్ణ అవగాహనతో ఉండేలా తయారు చేస్తున్నారు! నాగార్జునసాగర్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్ రాజకీయ శిక్షణ శిబిరాల్లో శిక్షణ ఇస్తున్నవారికి, శిక్షణ పొందుతున్నవారికిమధ్య సమన్వయకర్తగా.. సంధానకర్తగా వ్యవహరిస్తూ భిన్న కోణాలు ఆవిష్కరిస్తున్నారు. తన అనుభవసారాన్ని ప్రతినిధులతో పంచుకుంటూ.. వారికి వచ్చిన సందేహాలను తాను సైతం తీర్చుతూ.. శిక్షణ మరింత ఫలప్రదమయ్యేందుకు తనవంతు పాత్ర పోషిస్తున్నారు.

KCR 01

-అర్థాలు వివరిస్తూ.. అనుభవాలు పంచుకుంటూ..
-శిక్షణ శిబిరంలో పెద్దరికం చాటుకుంటున్న సీఎం
-జనం భాషలోనే మాట్లాడాలనివక్తలకు సూచన
-నిపుణులు.. నేతలకు మధ్య సమన్వయానికి కృషి
ఒకవిషయంపై నిపుణులు కొన్ని సాంకేతిక అంశాలు వివరించే సమయంలో వారి పంథాలో వెళుతున్నపుడు అది ప్రతినిధులకు అర్థం అయ్యేలా బాధ్యత తీసుకుంటున్నారు. జనం భాషలో వాటిని ప్రతినిధులకు వివరిస్తున్నారు. రెండో రోజైన ఆదివారం వ్యవసాయం, చట్టసభల వ్యవహారాల అంశాలపై నిపుణులు ప్రసంగాలు చేస్తున్న సమయంలో సీఎం ఇదేరీతిన స్పందించారు.

సాధారణ భాషలో వివరించిన సీఎం
వ్యవసాయంపై తరగతులు జరుతుండగా.. శాస్త్రవేత్తలు గ్రీన్‌హౌస్ గ్యాస్, ఫాం మెకనైజేషన్‌లాంటి పదాలతో సాంకేతిక భాష వాడారు. వాటిపై పూర్తిగా అవగాహన కలుగకపోవడంతో ప్రతినిధులు సందేహాలు వ్యక్తంచేశారు. శాస్త్రవేత్తలు మరోసారి వివరించినా.. అదీ సాంకేతిక పరిభాషలోనే సాగింది. చివరకు కేసీఆర్ లేచి, మాట్లాడారు. శాస్త్రవేత్తలు తాము చేసిన పరిశోధనలు, అధ్యయనం అంశాలను బాగా చెప్పారని, కానీ భాష అర్థమయ్యేలా లేదన్నారు. అందరికీ అర్థమయ్యే భాష వాడినప్పుడే సామాన్యులకు ఆ విషయాలు చేరతాయన్నారు. టీఆర్‌ఎస్‌కు ఇతర పార్టీలకు ఉన్న తేడా ఇదే. మా బలం.. ప్రజలకు అర్థమయ్యేట్లు చెప్పడం అని కేసీఆర్ అన్నారు.

కొన్ని రకాల మొక్కలు, వృక్షాలు విడుదలచేసే గాలుల్లో చెడు వాయువులుంటాయని, వాటినే గ్రీన్‌హౌస్ గ్యాస్ అంటారని ప్రతినిధులకు తెలిపారు. ఆ వాయువు పెరిగిపోతే భూమి వేడి పెరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పారు. అందుకే గ్రీన్‌హౌస్ గ్యాస్ తగ్గించాలని అన్నారు. బిందుసేద్యంవల్ల ఇది సాధ్యమవుతుందని వివరించారు. ఫాం మెకనైజేషన్ అంటే వ్యవసాయంలో యంత్ర పరికరాల వినియోగమని, దీనివల్ల పెట్టుబడి తగ్గి, దిగుబడులు పెరగుతాయని వివరించారు. దీంతో హాలులో చప్పట్లు మారుమోగాయి. రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ ఒకప్పుడు మంచి విత్తనాలు తయారు చేసేదని, కానీ తర్వాత అది భ్రష్టు పట్టిందని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. వర్సిటీని మళ్లీ ఒకప్పటి గొప్ప స్థాయికి తీసుకువెళ్లాలని సీఎం సూచించారు.

బడ్జెట్ అంశాన్ని వివరించిన కేసీఆర్
శాసనసభ వ్యవహారాలపై అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాం ఉపన్యసించేటప్పుడు కూడా సాంకేతిక పదాలు వాడారు. కేసీఆర్ చొరవ చేసుకుంటూ వాటిని మరింత సమగ్రంగా వివరించారు. బడ్జెట్ ప్రస్తావనకు వచ్చినపుడు.. అసెంబ్లీ సెక్రటేరియట్ కేవలం సభ వ్యవహారాలు చూస్తుందని, బడ్జెట్‌ను ప్రభుత్వం తయారు చేస్తున్నందున.. దానిని తానే బాగా వివరించగలనని సీఎం అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత బడ్జెట్ రూపకల్పన అనుభవాలను, ఇతర రాష్ర్టాల్లో ఘటనలను సైతం ఉదహరించారు.