నవ తెలంగాణకు జన ప్రణాళిక

-మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వరుసగా ప్రణాళికా సదస్సులు
-మన ప్రణాళికను మనమే రూపొందించుకుందాం
-ప్లాన్ యువర్ విలేజ్, ఫార్మ్ యువర్ పాలసీ
-అట్టడుగునుంచి అభివృద్ధి ప్రణాళికలు
-అవసరానికి సరిపడా ప్రభుత్వ భూమి
-ఇక ఆచరణాత్మక అభివృద్ధి పథం

KCR-002

అభివృద్ధి ప్రణాళికలు కూడా పైనుంచి కిందికి ప్రసరించడం కాదు, గ్రామీణస్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా జరగాలి. సమాజంలో అన్ని స్థాయిలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు విధానాల రూపకల్పన (పాలసీ ఫార్మేషన్)లో భాగస్వాములు కావాలి.తెలంగాణ రాష్ట్రం వచ్చే రెండేండ్లలో తనకంటూ ఒక సొంత ఒరవడిని సృష్టించుకోవాలి. సరికొత్త ప్రయాణం ప్రారంభించాలి. నా గ్రామం, నా మండలం, నా జిల్లా, నా రాష్ట్రం.. దీనిని బాగుచేసుకుంటా.. అనే స్పృహ అందరిలో రావాలి.. ప్లాన్ యువర్ విలేజ్, ఫార్మ్ యువర్ పాలసీ.. ఒక నినాదం కావాలి. గ్రామాల ప్రణాళిక తర్వాత మండలస్థాయిలో సదస్సులు నిర్వహించాలి. ఆ తర్వాత జిల్లాస్థాయిలో ప్రణాళికా సదస్సులు జరగాలి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలరోజులుగా ఏం చేస్తున్నది? ఏం చేయాలనుకుంటున్నది?.. ఒక్క పనికూడా చేయలేదని ఒక నాయకుడు విమర్శించాడు. ఒరిగిందేమీ లేదని ఇంకో నాయకుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యాఖ్యలపై అనుభవజ్ఞుడైన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయం తెలుసుకుంటే వాస్తవమేమిటో బోధపడుతుంది. తెలంగాణ ఇప్పుడున్న రూపంలో ఒక రాష్ట్రంగా అవతరించడం ఇదే ప్రథమం. సొంత ప్రభుత్వం, అదీ కొత్త ప్రభుత్వం. ఆఫీసులు లేవు.. చట్టాలు లేవు.. మనకంటూ సొంత విధానాలు లేవు.. ప్రణాళికలు లేవు.. వ్యూహం లేదు.. ఛూ మంత్రకాళీ అని ఏదో ఒకటి తీయడానికి ఇదేమీ గారడీ కాదు.. మ్యాజిక్ షో అంతకంటే కాదు అందరినీ ఆశ్చర్యపర్చడానికి అని ఆ అధికారి వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణకు ఒక కొత్త మార్గాన్ని కనుక్కునే ప్రయత్నంలోనే బుధవారంనాడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో తొలి అడుగుగా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారని ఆయన చెప్పారు. తదుపరి ఏడో తేదీన జరిగే సమావేశంలో మంత్రులు, సలహాదారులు, అన్ని శాఖల కార్యదర్శులు, ఆయా విభాగాల అధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, పెద్ద మున్సిపాలిటీల కమిషనర్లు, మరికొంత మంది జిల్లాస్థాయి ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఆ తదుపరి శని, ఆదివారాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లతో సదస్సు జరిగే అవకాశం ఉంది. అన్ని రకాల ఎన్నికలు పూర్తయ్యాయి.

విధానాలు, ప్రణాళికల రూపకల్పనలో అన్ని పార్టీలను భాగస్వాములను చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు అని ఆయన చెప్పారు. జూలై నెలాఖరులోపు అన్ని స్థాయిల్లో సదస్సులు, సంప్రదింపులు జరిపి ప్రణాళికా రచనను పూర్తిచేయాలన్నది కేసీఆర్ ఆలోచన అని ఆయన తెలిపారు.
తెలంగాణ 1948లో హైదరాబాద్ రాష్ట్రంగా విముక్తిపొందినా మూడేండ్లు మిలిటరీ, సివిల్ అధికారుల పాలనలోనే ఉంది.

1952లో పౌరపాలన ఏర్పడినా కన్నడ, మరాఠా ప్రాంతాలు మనతో కలిసి ఉన్నాయి. తెలంగాణకు సొంతంగా చట్టాలు, విధానాలు రూపొందించుకునే సమయమే దక్కలేదు. 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి ఆధిపత్యవర్గాలు చేసిన చట్టాలే మనకు దిక్కయ్యాయి. ఇప్పుడున్న చట్టాలన్నీ ఆంధ్రప్రదేశ్ థృక్పథంతో ఆంధ్ర ఆధిపత్య వర్గాల ప్రయోజనాలకనుగుణంగా తయారయినవి.

తెలంగాణ రాష్ట్రం వచ్చే రెండేండ్లలో తనకంటూ ఒక సొంత ఒరవడిని సృష్టించుకోవలసి ఉంది. తన బాటను తానే ఎంచుకుని సరికొత్త ప్రయాణం ప్రారంభించాలి అని ముఖ్యమంత్రి అధికారులను కోరినట్టు సీనియర్ అధికారి ఒకరు వివరించారు. విధానాలు, ప్రణాళికల రచనలో మూస పద్ధతికి స్వస్తి చెప్పాలి. తెలంగాణ కండ్లతో, తెలంగాణ థృక్పథంతో, తెలంగాణ విజన్‌తో విధానాలు రూపొందించుకోవాలి. చట్టాలు చేసుకోవాలి. ప్రణాళికలు రచించుకోవాలి.

అమలుకు సంబంధించిన పకడ్బందీ వ్యూహాన్ని ఖరారు చేయాలి అని ముఖ్యమంత్రి కోరారు. అభివృద్ధి ప్రణాళికలు కూడా పైనుంచి కిందికి ప్రసరించడం కాదు, గ్రామీణస్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా జరగాలి. సమాజంలో అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అధికారులు విధానాల రూపకల్పన (పాలసీ ఫార్మేషన్)లో భాగస్వాములు కావాలి అని ముఖ్యమంత్రి చెప్పారు. నా గ్రామం, నా మండలం, నా జిల్లా, నా రాష్ట్రం.. దీనిని బాగుచేసుకుంటా.. అనే స్పృహ అందరిలో రావాలి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్లాన్ యువర్ విలేజ్, ఫార్మ్ యువర్ పాలసీ.. ఒక నినాదం కావాలి.

గ్రామాల ప్రణాళిక తర్వాత మండలస్థాయిలో సదస్సులు నిర్వహించాలి. ఆ తర్వాత జిల్లాస్థాయిలో ప్రణాళికా సదస్సులు జరగాలి. ప్రణాళికా రచన పారదర్శకంగా జరిగితే వాటి అమలులో ఫలితాలు ప్రజలకు సక్రమంగా అందుతాయి. ఎక్కడ ఏమి జరుగుతున్నదో ప్రజలకు తెలియాలి. అలా అయితేనే అవినీతి అక్రమాలను అరికట్టవచ్చు అని ముఖ్యమంత్రి అన్నారు.

ప్రజాప్రతినిధులకు అన్నీ తెలిసి ఉండాలి: ఒక ప్రభుత్వానికి లేక ప్రజాప్రతినిధికి ఏమేమి తెలిసి ఉండాలి? భూముల లెక్క తెలిసి ఉండాలి. ఈ భూమి మీద ప్రతి అంగుళం మీద అవగాహన ఉండాలి. కురిసే ప్రతి వాన చుక్క ఎక్కడికి పోతుందో తెలిసి ఉండాలి. ఖనిజ వనరులు, మానవ వనరులు, విద్యుత్తు లభ్యత, నీటి లభ్యత, చెట్టు చేమల సంఖ్య.. ఇలా అన్ని వివరాలూ ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలిసి ఉండాలి. ఆ అవగాహన ప్రాతిపదికపైనే ప్రణాళికా రచన జరగాలి. గ్రామాల అవసరాల ఆధారంగా ప్రణాళికలు రూపొందాలి. ప్రజాప్రతినిధులు ప్రేక్షకులు కాకూడదు, భాగస్వాములు కావాలి అని ముఖ్యమంత్రి కోరారు.

సమతుల అభివృద్ధికి బాటలు: తెలంగాణలో చాలినంత ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. కంపెనీలు పెట్టడానికి, ప్రభుత్వ సంస్థలు నెలకొల్పడానికి, ఆశ్రమ పాఠశాలలు నిర్మించడానికి బీదాబిక్కి మధ్య తరగతి రైతుల నుంచి భూములు గుంజుకోవలసిన అవసరమే లేదు. ఇప్పటికిప్పుడు 40 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నట్టు అధికారులు లెక్కలు తేల్చారు. వ్యవసాయానికి పనికిరాకుండా ఇతర అవసరాలకు పనికివచ్చే భూమి 13.29 లక్షల ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంది. లక్షన్నర ఎకరాలు కేటాయిస్తే ప్రతి జిల్లాలో రెండుమూడు పారిశ్రామికవాడలు అభివృద్ధి చేయవచ్చు.