ఖేడ్‌కు గోదావరి జలాలు..

కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను సింగూరుకు తరలించి నారాయణఖేడ్ దాహార్తిని తీర్చే దిశగా చర్యలు తీసుకుంటామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు.
-మెదక్ జిల్లాలో రూ.1000 కోట్ల విద్యుత్ పనులు
-రూ.250 కోట్లతో నాందేడ్-అకోలా రహదారి విస్తరణ
-పారదర్శక పాలన అందిస్తాం.. భారీ మెజార్టీయే లక్ష్యంగా పనిచేయాలి
-నారాయణఖేడ్‌లో కార్యకర్తలకు మంత్రి హరీశ్‌రావు దిశానిర్దేశం

Harish-Rao-addressing-in-Narayanked-trs-party-meeting

మెదక్ జిల్లా నారాయణఖేడ్, కల్హేర్ మండలాల్లో గురువారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశాలలో, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో మంత్రి మాట్లాడారు. తమది అవినీతిరహిత ప్రభుత్వమని, ఎవ్వరికీ పైసా లంచం ఇవ్వకుండా పనులు చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ పాలనలో ఏ పథకం చూసినా అవినీతి మయమేనని, చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంల పేర కాంగ్రెస్ నాయకులు చేసిన అవినీతిని కక్కిస్తానని చెప్పారు.

గత ప్రభుత్వం హయాంలో 2013-14 సంవత్సరంలో విద్యుత్ రంగానికి సంబంధించి మెదక్ జిల్లాకు రూ.100 కోట్లు మాత్రమే మంజూరు చేయగా తమ ప్రభుత్వం నియోజకవర్గానికి 100 కోట్ల చొప్పున జిల్లాకు రూ.1000 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. సంగారెడ్డి-అకోలా రహదారిని నాలుగు లేన్‌ల రహదారిగా విస్తరింపజేసేందుకు రూ.250కోట్లు మంజూరు చేస్తున్నామని, సంగారెడ్డి, జోగిపేట, పెద్దశంకరంపేట పట్టణాలకు బైపాస్ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ప్రస్తుతం దళితులకు మాత్రమే వర్తింపజేస్తున్న కల్యాణలక్ష్మి పథకాన్ని త్వరలో బీసీలతో పాటు అన్నివర్గాల్లోని నిరుపేదలకు వర్తింపచేస్తామని మంత్రి తెలిపారు. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను సింగూరుకు తరలించి ప్రజల దాహార్తిని తీర్చే దిశగా చర్యలు తీసుకుంటామని, ఏడాదిన్నర కాలంలో వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీరందిస్తామన్నారు. ప్రస్తుత కరువు పరిస్థితుల దృష్ట్యా ఎండిన పంటకు నష్టపరిహారం అందజేయడంతో పాటు ప్రస్తుతమున్న 100 రోజుల పనిదినాలను 150 రోజులకు, రూ.100గా ఉన్న కూలీని రూ.180కి పెంచి ఆదుకుంటామన్నారు. గత 11సంవత్సరాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏలిన సమయంలోనే నారాయణఖేడ్‌కు ఏమి చేయలేని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నామని చెబుతూ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నారాయణఖేడ్‌లో రూ.14కోట్లతో రెండు మార్కెట్‌యార్డులు సహా అన్ని మండలాల్లో గోదాంలను నిర్మించేందుకు చర్యలు చేపట్టిన విషయం ప్రజలు గమనించాలన్నారు.

మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసినా కాంగ్రెస్ నాయకులు అభ్యర్థిని పోటీకి నిలిపి అభాసుపాలయ్యారని అన్నారు. టీడీపీ తాడు బొంగరం లేనిదని, ఆ పార్టీ అధినేత విజయవాడకు పోయాడని ఇక వారితో పనిలేదన్నారు. వరంగల్ ప్రజలు టీడీపీకి కర్రుకాల్చి వాత పెట్టగా, రంగారెడ్డి జిల్లా నవాబ్‌పేట్‌లో తాజాగా జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని చెత్తబుట్టలో వేశారని అన్నారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో డిపాజిట్టు కూడా దక్కదని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు తల్లి లాంటిదని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ ఇచ్చే దిశగా కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కల్హేర్ కార్యకర్తల సమావేశంలో కళాకారుడు సాయిచంద్ తన ఆటపాటలతో కార్యకర్తలను ఉర్రూతలుగించారు.

-మంత్రి విస్తృత పర్యటన
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్దశంకరంపేట, కల్హేర్, నారాయణఖేడ్ మండలాల్లో మంత్రి హరీశ్ రావు విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్దశంకరంపేట మండలం జంబికుంటలో రూ.1.24కోట్లతో నిర్మించిన 33/11కేవి సబ్‌స్టేషన్ ప్రారంభోత్సం, కల్హేర్ మండలం ఫత్తేపూర్ చౌరస్తా నుంచి తిమానగర్ వరకు రూ.29.5లక్షల వ్యయంతో బీటి రోడ్డు మరమ్మతు పనులకు భూమిపూజ, నారాయణఖేడ్ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గంగాపూర్ గ్రామం వరకు రూ.10లక్షలతో నూతనంగా వేసిన బీటీరోడ్డుకు ప్రారంభోత్సం, కల్హేర్, నారాయణఖేడ్ మండలాల కార్యకర్తల సమావేశాలతో పాటు నారాయణఖేడ్‌లో ప్రైవేట్ డ్రైవర్‌ల సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు.