నమ్మించి గొంతుకోసేలా బాబు తీరు

-సీమాంధ్రుల కనుసన్నల్లోనే టీ టీడీపీ మ్యానిఫెస్టో
-అధికారంలో ఉండీ చేయని పనులన్నీ మ్యానిఫెస్టోలోనా?
-వ్యవసాయం దండగన్న బాబు పెద్దపీట వేస్తాడా: హరీశ్ ఆశ్చర్యం

Harish Rao Press Meet 02-04-14

తెలంగాణ టీడీపీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో..సీమాంధ్రుల కన్నుసన్నల్లో తయారు చేసినట్టున్నదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. మంగళవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఆయన మాట్లాడారు. టీ టీడీపీ వ్యవహారం ఎప్పటికీ ఆంధ్రదేశం పార్టీలాగే కొనసాగుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తీరు చూస్తే తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతుకోసేలా ఉందని, టీ టీడీపీ మ్యానిఫెస్టో చూస్తే ఇది స్పష్టమవుతోందన్నారు. అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు చేయని పనులన్నింటినీ ఇప్పుడు ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచారని, దీంతో ఓట్ల కోసం చంద్రబాబు దిగజారిన తీరు తెలిసిపోతోందని దుయ్యబట్టారు. మ్యానిఫెస్టోలో అమరవీరుల గురించి ప్రస్తావించిన చంద్రబాబు.. టీడీపీ వల్లే 1200 మంది అమాయకులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ విషయాన్ని సూసైడ్‌నోట్‌లో కూడా స్పష్టంగా రాసి ఉన్న విషయం మరిచారా అని ప్రశ్నించారు.

కావాలనుకుంటే ఆ సూసైడ్‌నోట్‌లను బాబుకు పంపిస్తానన్నారు. 2019 వరకు 50 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన బాబు, ఆయన సీఎంగా ఉన్నప్పడు ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానాన్ని తీసుకొచ్చి అనేక మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడారని గుర్తుచేశారు. వ్యవసాయం దండగన్న ఆయన, ఇప్పుడు అదే వ్యవసాయానికి పెద్దపీట వేస్తానని, 9 గంటల విద్యుత్ నిరంతరాయంగా సరఫరాచేస్తానని మోసపూరితమైన ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలో ఉండగా, 10 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోపై సీమాంధ్రుల బొమ్మలే ఉన్నాయి తప్ప తెలంగాణ టీడీపీ నేతలవి ఒక్కరివి లేవేమని ప్రశ్నించారు. తెలంగాణలో ఎలాగూ మనుగడ లేదనుకున్న చంద్రబాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు కాళ్లబేరానికి వెళ్లారని విమర్శించారు. త్వరలో తెలంగాణలో టీడీపీ కార్యాలయాలకు టులెట్ బోర్డు ఖాయమన్నారు.