నాలుగేండ్లలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు

– క్రిస్టల్ డ్రాప్స్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్

KTR 06
భారతదేశం గ్రామీణ మంచినీరు, పారిశుధ్యం అంశాల్లో పెనుసవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. మాదాపూర్‌లోని హెచ్‌ఎస్‌బీసీ ఆధ్వర్యంలో గ్రామీణ మంచినీటి సౌకర్యాన్ని అందించేందుకు క్రిస్టల్ డ్రాప్స్ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 16 గ్రామాల్లో దాదాపు రూ.2 కోట్లతో గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుధ్య కార్యక్రమానికి హెచ్‌ఎస్‌బీసీ నడుం బిగించడం అభినందనీయమన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో తెలంగాణలోని ప్రతీ ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఎంఓయూపై సంతకం చేసుకోవడం జరిగిందన్నారు.

రూ.24వేల కోట్లతో ఈ కనెక్షన్లను వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ్ భారత్, శ్రేష్ఠ్ భారత్‌కు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఇందులోభాగంగా 2015 ఆగస్టు 15 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని 2190 ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం నీటిని పొదుపుగా వాడడం అనే బ్యానర్‌పై కేటీఆర్ సంతకం చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎస్‌బీసీ సిబ్బంది పాల్గొన్నారు.