40 లక్షలు దాటిన సభ్యత్వాలు

-అన్ని వర్గాల ప్రజలనుంచి భారీగా స్పందన
-తక్కువ సమయంలో అంచనాకు మించి నమోదు
టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన లభిస్తున్నది. అంచనాకు మించి సభ్యత్వ నమోదు అయింది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. గులాబీ పార్టీలో తమ సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారు. అనుకున్న గడువు ప్రకారం అతి తక్కువ సమయంలో ఏ రాజకీయ పార్టీ చేయనివిధంగా పెద్దఎత్తున సభ్యత్వ నమోదు చేయటం గమనార్హం. ఈ నెల న సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభంకాగా.. నేటితో ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల్లో 30లక్షల మంది సభ్యత్వం చేయాలని ముందు అంచనా వేయగా.. ఇప్పటికే 40లక్షలు దాటి 50లక్షల దిశగా దూసుకుపోతున్నది. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ఇప్పటివరకు 8,55,756మంది క్రియాశీల సభ్యత్వం, 32,39,667మంది సాధారణ సభ్యత్వం తీసుకున్నారు.

Membership-drive-programme

మొత్తం40,95,423మంది టీఆర్‌ఎస్ పార్టీలో సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 53,43,810సభ్యత్వ పుస్తకాలు జారీ చేశారు. ఇందులో 13,72,301క్రియాశీల సభ్యత్వాలు, 39,71,509సాధారణ సభ్యత్వ పుస్తకాలను ఆయా జిల్లాలకు పంపిణీ చేశారు. తాజాగా గురువారం మరో 70,975 సభ్యత్వ పుస్తకాలను అదనంగా జారీ చేశారు. ఇందులో 38,300క్రియాశీల, 32,675సాధారణ సభ్యత్వ నమోదు పుస్తకాలున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం, హైదరాబాద్ జిల్లాలోని మల్కాజ్‌గిరి, సనత్‌నగర్, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల, కల్వకుర్తి నియోజకవర్గాలు, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, సిరిసిల్ల నియోజకవర్గాలు, వరంగల్‌లో వర్ధన్నపేట, ఆదిలాబాద్‌లో చెన్నూరు, నల్లగొండలో హుజూర్‌నగర్, ఆలేరు, మెదక్‌లో నర్సాపూర్, జహీరాబాద్ నియోజకవర్గాలకు అదనపు సభ్యత్వ పుస్తకాలు జారీ చేశారు. మరోవైపు 7,71,980 సభ్యత్వాల నమోదుకు సంబంధించి కంప్యూటర్‌లో డాటా ఎంట్రీ కూడా పూర్తయింది. మరో 30,334మంది ఆన్‌లైన్ సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదుకు అన్నివర్గాల ప్రజల నుంచి భారీగా స్పందన లభిస్తున్నది. గురువారం వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమక్షంలో సెటిలర్లు పార్టీలో చేరారు.

Membership drive 01

లక్డీకాపూల్‌లో మంత్రులు కేటీఆర్, పద్మారావు, జంట నగరాల అడ్‌హక్ కమిటీ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో న్యాయవాదులు, టీఆర్‌ఎస్ భవన్‌లో స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్ పరిశీలకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బొంతు రామ్మోహ్మన్ సమక్షంలో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రంతో సభ్యత్వ నమోదు ప్రక్రియ ముగియనుందని.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన లభించిందని స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నమస్తే తెలంగాణతో పేర్కొన్నారు. ఇప్పటికే డాటా ఎంట్రీ వేగంగా సాగుతున్నదని.. మూడు, నాలుగు రోజుల్లో డాటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. పుస్తకాలు, డాటాను 3,4రోజుల్లో తెలంగాణ భవన్‌లో అందించాలని సూచించారు.