నాగోబా జాతర అభివృద్ధికి రూ.రెండు కోట్లు

– శాశ్వత ప్రాతిపదికన పనులు: మంత్రి అల్లోల హామీ
– జిల్లా అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి: మంత్రి జోగు
– పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రులు.. పోటెత్తిన భక్తులు

Indrakaran-Reddy

వచ్చే ఏడాది నాటికి నాగోబా ఆలయాన్ని రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తామని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం నాగోబా సన్నిధిలో నిర్వహించిన గిరిజన దర్బార్‌కు వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో ఆదివాసీలు తరలివచ్చారు. మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ నగేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముత్నూర్ నుంచి కేస్లాపూర్ వరకు రెండు వరుసల రహదారిని శాశ్వత ప్రాతిపదికన ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు.
26 ఎకరాల ఆలయ భూమిని రక్షించేందుకు కంచె, లేదా ప్రహరీ నిర్మిస్తామన్నారు. వాటర్‌గ్రిడ్ ద్వారా రక్షిత నీటిని అందిస్తామని, ఉట్నూర్ దవాఖానను ఆధునీకరిస్తామని హామీఇచ్చారు. ఆదివాసీల ఆయుప్రమాణాలు తక్కువగా ఉన్నందున 50 ఏండ్లు నిండిన వారికి పింఛన్ ఇచ్చే విషయమై సీఎంతో మాట్లాడుతామన్నారు. జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి జోగు రామన్న తెలిపారు. జోడెఘాట్‌లో రూ.25 కోట్లతో జోడెఘాట్‌లో మ్యూజియం, హైదరాబాద్‌లో కొమురంభీం, బంజారా భవనాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలుకు కొమురంభీం పేరు పెట్టేలా, ఆశ్రమ పాఠశాలల సీఆర్టీలకు రూ.14 వేల వేతనం, ఉట్నూర్ డైట్ కళాశాల పునఃప్రారంభించేలా చర్యలు చేపడుతామన్నారు. గిరిజన బీఈడీ కళాశాలలో సీట్లు పెంచుతామని తెలిపారు. వచ్చే దర్బార్ నాటికి ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చారు.