నగరం నలువైపులా అభివృద్ధి

-రీజినల్ రింగ్ రోడ్‌తో మారనున్న రూపురేఖలు..
-రేడియల్, గ్రిడ్ రోడ్లతో కొత్తగా ఆర్థిక మండళ్లు
-స్పష్టమైన ప్రణాళికలతో ఔటర్ చుట్టూ అభివృద్ధి..
-భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా గ్రోత్ కారిడార్
-ఈ ఏడాది పెద్దఎత్తున ప్రారంభోత్సవాలు: మంత్రి కేటీఆర్
-రూ.450 కోట్లతో చేపట్టనున్న రేడియల్ రోడ్ల పనులకు శంకుస్థాపన

ఔటర్ రింగ్ రోడ్ అవతల 350 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్)తో హైదరాబాద్ రూపురేఖలు మారనున్నాయని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌తోపాటు ఫార్మాసిటీ, 350 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఎంఎస్‌ఈ పార్కుతో నగర అభివృద్ధిలో మరింత వేగం పుంజుకుంటుందన్నారు. ఔటర్‌కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు, గ్రిడ్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తే కొత్తగా ఆర్థిక మండళ్లు వచ్చే అవకాశం ఉన్నదని, తద్వారా నగరం నలువైపులా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.

నగరం నుంచి ఔటర్ వరకు ప్రయాణాన్ని మెరుగుపరుస్తూ ఆర్ అండ్ బీ శాఖ నాలుగు రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో భాగంగా రూ.152 కోట్ల అంచ నా వ్యయంతో హెచ్‌సీయూ నుంచి వట్టినాగులపల్లి వరకు రేడియల్ రోడ్ నంబర్-30 నిర్మాణ పనులకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నల్లగండ్ల వద్ద, రూ.199 కోట్ల అంచనా వ్యయంతో ఈదులనాగుల పల్లి నుంచి కొండకల్ వరకు, రూ.94 కోట్లతో తెల్లాపూర్ నుంచి మొకిల్లా వరకు రేడియల్ రోడ్‌నంబర్-7 విస్తరణ పనులకు రామచంద్రాపురం మండలం కొల్లూరు వద్ద ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ మంగళవా రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గత పాలకులకు ముందుచూపు లేకపోవడంతో హైదరాబాద్‌లో క్రమబద్ధమైన అభివృద్ధి జరుగలేదని డ్రైనేజీ, రోడ్ల వ్యవస్థ సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఔటర్ చుట్టూ స్పష్టమైన ప్రణాళికలతో భవిష్యత్తు తరాలను ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఔటర్‌కు ఇరువైపులా గ్రోత్ కారిడార్‌ను క్రమబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

ఈ ఏడాది పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు
నగరాభివృద్ధికి ఊతమిచ్చేలా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించేందుకు చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా అయ్యప్పసొసైటీలో అండర్‌పాస్‌ను అం దుబాటులోకి తెచ్చి తొలి ఫలాలు అందించామన్నా రు. వెస్ట్‌జోన్‌లో ఎక్కువ గా ఐటీ, నాలెడ్జ్ సెంటర్లు వస్తున్నాయని, ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్న దృష్ట్యా రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేశామన్నారు. మూడున్నరేండ్లుగా పలు ప్రాజెక్టులను పట్టాలెక్కించామని వాటి ఫలితాలను దశలవారీగా ప్రజలకు చేరవేస్తామని చెప్పారు. ఈ ఏడాది ఎగ్జిక్యూషన్ ఇయర్ అని, పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు ఉండబోతున్నాయని తెలిపారు.

రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం
ఔటర్‌కు అనుసంధానంగా రేడియల్, గ్రిడ్ రోడ్ల నిర్మాణాలు పూర్తయితే ఐటీ రంగాన్ని నగరానికి నలువైపులా తీసుకువెళ్లే అవకాశం ఉంటుందన్నారు. 35 రేడియల్ రోడ్లలో 17 రోడ్లను హెచ్‌ఎండీఏ పూర్తి చేసిందని, 4 రోడ్లను ఆర్‌అండ్‌బీ శాఖ చేపట్టిందన్నా రు. మిగతా 14 రోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. ట్రాఫిక్ రద్దీ, భూ సేకరణ వంటి సమస్యలు ఎదురవుతున్నాయని, త్వరలోనే పరిష్కారం చూపుతామ న్నారు. ఆర్‌ఆర్‌ఆర్ పనులు త్వరలో చేపడుతామన్నా రు.కండ్లకోయ జం క్షన్ వద్ద కొనసాగుతున్న 1.1 కి.మీ పనులను నెలరోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అభ్యర్థన మేరకు బీహెచ్‌ఈఎల్ వద్ద అరకిలోమీటర్ రోడ్డు పనులను మంజూరు చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో రోడ్లు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో రోడ్ల నిర్మాణం జరుగుతున్నదన్నారు. గత ప్రభుత్వాలు హైదరాబాద్‌ను చిందర వందరగా చేశాయని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించి నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, యాదిరెడ్డి, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.