నాబార్డు సాయంతో గోదాముల నిర్మాణం

– డివిజన్ స్థాయికి రైతు బజార్ల విస్తరణ
– పత్తి రైతులకు మూడు రోజుల్లో చెల్లింపులు
– సమీక్షా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

Harish-Rao-Review-meeting-with-Marketing-and-warehousing-department
రాష్ట్రంలో 17 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాముల ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించాలని నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్కెటింగ్, సహకార మరియు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం మరియు నిజామాబాదు జిల్లాల్లో 21.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వకు గోదాముల సమస్య వుందని వెల్లడైందని చెప్పారు.
ఈ కొరతను అధిగమించేందుకు నాబార్డు సహకారంతో వచ్చే మూడేండ్లలో రూ.1000 కోట్లతో ప్రాథమికంగా 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాములు నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. నెలాఖరులోగా వీటికి సంబంధించిన డీపీఆర్ లు తయారుచేయాలని ఆదేశించారు. అలాగే రెవెన్యూ డివిజన్ స్థాయి వరకూ రైతుబజార్లను విస్తరింపచేయాలని మంత్రి ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 51 మొబైల్ వాహనాలు మరియు కాలనీల్లో 51 రీటైల్ కేంద్రాలను ఏర్పాటుచేసి నాణ్యమైన కూరగాయలు సరఫరా చేయాలని సూచించారు. సీసీఐ ఇప్పటివరకు 76.00 లక్షల క్వింటాళ్ల పత్తి సేకరించిందని ఇది రాష్ట్రంలో మొత్తం పండించిన పత్తిలో 89 శాతమని వివరించారు.

10-15 రోజుల్లో రైతులకు చెల్లింపులు చేస్తున్నారని, అలా కాకుండా మూడురోజుల్లోనే చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించారు. అతి తక్కువ క్రిమిసంహారక మందులు, ఎరువులతో పండించిన ఆరోగ్యకరమైన తాజా కూరగాయాలు అందించేందుకు ప్రభుత్వం మన ఊరు-మన కూరగాయలు కార్యక్రమం ప్రారంభించిందని వివరించారు.ఈ పథకాన్ని నిర్వహించేందుకు సీఈవో స్థాయి ప్రత్యేక అధికారి నియామకం కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విష్ణు, నాబార్డు, సీసీఐ, మార్కెటింగ్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.