Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ముందుగా పునరావాసం

పులిచింతల ప్రాజెక్టుతో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించిన తర్వాతే 20 టీఎంసీల నీటి నిల్వకు సహకరిస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల సాగునీటి అధికారులు, ఆర్ అండ్ ఆర్ కమిషనర్, కృష్ణా జిల్లా సీఈ, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి, నీటిపారుదలరంగ సలహాదారు విద్యాసాగర్‌రావుతో ఆదివారం పులిచింతల ప్రాజెక్టుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పులిచింతల ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరు నిల్వ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం పదేపదే కోరుతున్నదని తెలిపారు.

ఆ తర్వాతే పులిచింతలలో నీటి నిల్వ
-పరిహారం, పునరావాసానికి రూ.130 కోట్లు కావాలి
-ఏపీ సర్కారు చెల్లిస్తేనే నీటి నిల్వకు అంగీకారం
-స్పష్టంచేసిన మంత్రి హరీశ్‌రావు
-యుద్ధప్రాతిపదికన చెరువుల పునరుద్ధరణ

Harish Rao

ఈ ప్రాజెక్టు వల్ల నల్లగొండ జిల్లాలో 13 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని.. వీరికి నష్టపరిహారం చెల్లించి, పునరావాసం కల్పించిన తర్వా తే వారి ప్రతిపాదనకు అంగీకరిస్తామని తెలిపారు. వీటికోసం రూ.130 కోట్లు అవసరమన్న హరీశ్… ముందు రూ. 40 కోట్లు ఇస్తే ఐదు గ్రామాల ప్రజలతో మాట్లాడి వారికి కావాల్సిన వసతు లు కల్పించి ఖాళీ చేయిస్తామని పేర్కొన్నారు. ఆరు గ్రామాల్లో పునరావాస సమస్యలున్నాయని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ కేంద్రాలకు భూసేకరణ, దేవాలయాలకు డబ్బు చెల్లింపు, శ్మశానాలకు భూసేకరణ, లిఫ్ట్ ఇరిగేషన్ మార్పు, ఇతర వ్యక్తగత పరిహార సమస్యలున్నాయని హరీశ్ చెప్పారు. ఈ విషయంపై ఏపీ మంత్రి దేవినేని ఉమతో మాట్లాడామని.. రూ.40 కోట్లు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారని తెలిపారు.

ఆ డబ్బు అందిన తర్వాత పునరావాసం, పరిహారం చెల్లింపులు పూర్తిచేసి.. అప్పుడు నీటి నిల్వకు అంగీకరిస్తామని స్పష్టంచేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మార్చేందుకు ఎంత ఖర్చవుతుందనేది రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీ వేశామని.. రెండు వారాల్లో నివేదిక ఇస్తారన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని మిర్యాలగూడ, హిల్‌కాలనీ, ఖమ్మం జిల్లాల్లోని క్వార్టర్లు చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయని.. నిరుపయోగంగా మారాయన్నారు. వీటి నిర్వహణ, విద్యుత్ బిల్లులు ప్రభుత్వానికి భారంగా మారిన నేపథ్యంలో బహిరంగ వేలంలో విక్రయించాలని నిర్ణయించామని మంత్రి చెప్పారు.

ఉద్యమంలా చెరువుల పునరుద్ధరణ
చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా.. ప్రజా కార్యక్రమంగా చేపడతామని, దీని అమలుపై ముఖ్యమంత్రితో మాట్లాడి తుదినిర్ణయం తీసుకుంటామన్నారు. ఏ గ్రామాల్లో చెరువుల పూడికతీత మట్టిని స్వచ్ఛందంగా పొలాల్లో పోసేందుకు ముందుకు వస్తారో మొదటి దశలో అక్కడ పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన, పారదర్శకంగా చేపడతామని స్పష్టంచేశారు. చిన్న నీటి పారుదల శాఖను మరింత బలోపేతం చేస్తామని.. ఇందుకు ఇద్దరు సీఈలు ఉంటే బాగుంటుందన్నారు. నీటి పారుదల శాఖ ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌లు, లేటెస్ట్ సర్వే సామాగ్రి, పరికరాలు ఇస్తామన్నారు.

మోదీకి దరఖాస్తు ఇవ్వండి
బీజేపీ నాయకులు కరెంటు సమస్యపై అంబేద్కర్ విగ్రహానికి మెమొరాండం ఇవ్వడాన్ని తాము ఆహ్వానిస్తున్నామని.. చాలా సం తోషమని హరీశ్ అన్నారు. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాలు కోరుకుంటే చేయాల్సిన ముఖ్యమైన పని ప్రధాని నరేంద్రమోదీకి దరఖాస్తు ఇవ్వాలన్నారు. ప్రధాని గంట సమయం కేటాయిస్తే ఉద్యోగుల విభజన పూర్తవుతుందని.. నాలుగు నెలలుగా ఆ పని పూర్తికావడం లేదన్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తించాలన్నారు. కరెంటు అడిగితే చంద్రబాబు ఇవ్వడం లేదని.. కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

దీన్ని బీజేపీ నేతలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు తప్పకుండా పెడదామని, అన్ని విషయాలు చర్చకు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. తెలంగాణకు కరెంటు ఇవ్వకుండా చంద్రబాబు చేస్తున్న కుట్రలపై కూడా చర్చిద్దామన్నారు. పబ్లిసిటీ కోసం దరఖాస్తులు పెడితే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.

Every contribution that you make can make a difference.

Please contribute generously to the TRS.

MAKE A DONATION NOW