ముంపు విద్యార్థుల ఫీజు మేమే చెల్లిస్తాం

-రీయింబర్స్‌మెంట్‌పై చంద్రబాబు దుష్ప్రచారం..
-హామీలు అమలు చేయలేకే తప్పుడు ఆరోపణలు
-టీడీపీ అధినేతపై మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపాటు
-డీఎస్సీ ఇప్పట్లో నిర్వహించలేమని స్పష్టీకరణ

Jagadish Reddy

ఖమ్మం జిల్లా పోలవరం ముంపు గ్రామాలకు చెందిన విద్యార్థుల ఫీజులను తెలంగాణ ప్రభుత్వమే చెల్లిస్తుందని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ముంపు మండలాలన్నీ తెలంగాణవేనని, అక్కడి విద్యార్థుల ఫీజులను తామే భరిస్తామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బాబు తన పద్ధతిని మార్చుకోవాలని జగదీశ్‌రెడ్డి సూచించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సోమవారం సమావేశం అయిన అనంతరం సచివాలయం మీడియా పాయింట్‌లో మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో చదివే ఇతర రాష్ర్టాల విద్యార్థుల ఫీజును చెల్లించే ప్రసక్తే లేదన్నారు. ఏపీ విద్యార్థుల ఫీజు ఆ ప్రభుత్వమే చెల్లించాలన్నారు. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షిస్తామన్నారు. విద్యార్థుల స్థానికతపై రెండు ప్రతిపాదనలున్నాయని, వాటిని పరిశీలిస్తున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. డీఎస్సీని ఇప్పట్లో నిర్వహించే పరిస్థితి లేదని మంత్రి తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేందుకు ఎలాంటి విధి విధానాలు ఉండాలనే అంశంపై కమిటీ వేసి కమిటీ నివేదిక ఆధారంగా అమలు చేస్తామన్నారు. స్కూళ్లలో టీచర్ల కొరత లేకుండా చేసి నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.