ముంబై తరహా రవాణా వ్యవస్థ

-భాగ్యనగరం బ్రాండ్‌ఇమేజ్‌ను విశ్వవ్యాప్తం చేస్తాం
-మంత్రులు మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి

Naini Narsimha Reddy
ముంబై తరహా ప్రజారవాణా వ్యవస్థను హైదరాబాద్‌లో అమలుపర్చి బ్రాండ్‌ఇమేజ్‌ను విశ్వవ్యాప్తం చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ముంబై రవాణావ్యవస్థ అద్భుతంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు. రవాణావ్యవస్థ పనితీరును అధ్యయనం చేసేందుకు అధికారులతో కలిసి మంత్రులు ముంబైలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ముంబై నుంచి నమస్తే తెలంగాణతో ఫోనులో మాట్లాడిన మంత్రులు అంధేరి బస్టాండులో మొరార్జీదేశాయ్ కాలంనుంచి ప్రయాణికులు అనుసరిస్తున్న క్యూ పద్ధతిని పరిశీలించామన్నారు.

అధ్యయనంలో భాగంగా ట్రాఫిక్‌వ్యవస్థ నియంత్రణపై జీఎం ఓం ప్రకాష్‌గుప్తా, డిప్యూటీ జీఎం దేశ్‌పాండే, ట్రాఫిక్ ఐజీ ఉపాధ్యాయ తదితరులతో చర్చించినట్టు చెప్పారు. ముంబై అగార్కర్, వాడాల డిపోల్లో పనితీరు చక్కగా ఉందన్నారు. మెట్రోవ్యవస్థతో పాటు ట్రాఫిక్, రోడ్డు భద్రతలను జీపీఆర్‌ఎస్ విధానం ద్వారా నియంత్రించే పద్ధతి ఆసక్తి కలిగించిందని, కంట్రోల్‌రూం ద్వారా తొమ్మిదివేల ఆర్టీసీ బస్సులు, 12 వేలమంది కండక్టర్లు, పదివేల మంది డ్రైవర్ల పనితీరును అనుక్షణం తెలుసుకోవడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. ఈ విధానం హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.

ట్రాఫిక్ పోలీసులు కేవలం తొమ్మిదికేంద్రాల ద్వారా ముంబైలోని ట్రాఫిక్ వ్యవస్థను నియంత్రించే పరిస్థితులను పరిశీలించినట్లు తెలిపారు. ట్రాఫిక్ మార్గాలతోపాటు, వాహనాల వేగం, నియంత్రణ గురించి తెలుసుకోవడంతోపాటు, ప్రమాదాలు జరిగినపుడు తీసుకునే చర్యలపై ఆరా తీశామన్నారు.

ఆర్టీసీబస్సులతోపాటు, ప్రైవేటు వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ రద్దీ పరిస్థితులను అధ్యయనం చేశామన్నారు. ముంబైలో మాదిరిగా హైదరాబాద్ రవాణావ్యవస్థలో క్యూ పద్ధతులు, ప్రజలను చైతన్యపర్చడంపై అధికారులతో సమీక్షించి నివేదికను సీఎం కేసీఆర్‌కు అందజేస్తామని, ఆయన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడ్తామని చెప్పారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, రవాణాశాఖ కమిషనర్ జగదీశ్వర్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, అదనపు సీపీ జితేందర్, ఆర్టీసీ జేఎండీ రమణారావు, హైదరాబాద్ జేటీసీ రఘునాథ్ మంత్రి ఓఎస్‌డీలు సుధాకర్‌రెడ్డి, విక్టర్ తదితరులు ముంబై పర్యటించిన బృందంలో ఉన్నారు.