ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా

– టీఆర్‌ఎస్ ఎంపీలకు ఢిల్లీలో విందు
– మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు

KCR Resignation

తాజా ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఎంపీ పదవికి రాజీనామాచేశారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తున్న రోజునే ఉదయం 8.15 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఆయన ఎంపీ పదవిని వీడారు. కేసీఆర్ మెదక్ జిల్లా గజ్వేల్ శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్న లేఖను తాజాగా ఎన్నికైన ఎంపీల ద్వారా లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందజేశారు.

అనంతరం సెక్రటరీ జనరల్ స్వయంగా కేసీఆర్‌కు ఫోన్ చేసి రాజీనామా విషయాన్ని అడిగి తెలుసుకుని ఆ పత్రాన్ని స్వీకరించారు. మెదక్ పార్లమెంటు స్థానానికి కేసీఆర్ రాజీనామా చేయడంతో త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. తాజా ఎన్నికల్లో గెలుపొందిన 11 మంది టీఆర్‌ఎస్ ఎంపీలకు కేసీఆర్ ఢిల్లీలోని తన నివాసంలో సోమవారం విందు ఇచ్చారు. సంపూర్ణ తెలంగాణ లక్ష్యంగా గరిష్ఠ స్థాయిలో ఎంపీలను గెల్చుకోవాలన్న తన ఆకాంక్ష నెరవేరినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గెలుపొందిన ఎంపీలను అభినందించారు. నాగర్‌కర్నూల్ నుంచి పోటీచేసి ఓడిపోయిన డాక్టర్ మందా జగన్నాథం కూడా సోమవారం కేసీఆర్‌ను కలుసుకున్నారు. విజయం సాధించలేకపోయినందుకు బాధపడుతున్న ఆయనను ధైర్యంగా ఉండాలని భుజం తట్టారు. ఓటమికి కారణాలపై ఇప్పటికే క్షేత్రస్థాయి వివరాలను కేసీఆర్‌కు మందా జగన్నాథం వివరించారు.

మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరైన కేసీఆర్ :  రాష్ట్రపతి భవన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన నరేంద్రమోడీ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. ఆయనతోపాటు ఎంపీలు కే కవిత, బీ వినోద్, జితేందర్‌రెడ్డి, జీ నగేష్, బీబీ పాటిల్, డాక్టర్ బీ నర్సయ్యగౌడ్, విశ్వేశ్వరరెడ్డి, బాల్క సుమన్, ప్రొఫెసర్ సీతారాంనాయక్ తదితరులు కూడా ఆయన వెంట ఉన్నారు.

కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని, బంగారు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు తదితరాలతో పాటు ప్రాణహిత-చేవెళ్ళకు జాతీయ హోదా, పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేంద్రం గుర్తింపు, బయ్యారంలో ఇనుము-ఉక్కు పరిశ్రమ నిర్మాణం తదితర పలు సమస్యలపై కేంద్రంతో చర్చించాలని టీఆర్‌ఎస్ భావిస్తున్నందున.. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు ఎంపీలంతా హాజరయ్యారు.