మోతెలో పసుపు శుద్ధి కర్మాగారం

– ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం
– త్వరలో అంకాపూర్, గుత్పల్లో పర్యటన
– అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్

KCR-04
నిజామాబాద్ జిల్లా మోతె గ్రామంలో పసుపు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో మోతె గ్రామస్తులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సూచించారు. కేంద్ర స్పైసెన్ బోర్డు సహకారంతో తెలంగాణలో సమగ్ర పసుపు అభివృద్ధి పథకాన్ని తీసుకురానున్నట్లు కేసీఆర్ తెలిపారు.

అంకాపూర్ గ్రామంలో రైతుల వ్యవసాయ పద్ధతులను, గుత్ప ఎత్తిపోతల పథకం విస్తరణ పనులను పరిశీలించేందుకు త్వరలోనే నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తానని సీఎం తెలిపారు. అంకాపూర్ గ్రామం రాష్ట్రంలోనే అదర్శంగా నిలుస్తున్నదని, అక్కడి రైతులకు ప్రభుత్వం చేయూతనిచ్చి, భూసార పరీక్షలు నిర్వహించి, ఆధునిక వ్యవసాయ పనిముట్లు అందిస్తే దేశంలోనే ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయ పద్ధతులపై సీఎం గురువారం సచివాలయంలో సమీక్షించారు. వ్యవసాయం, ఉద్యానవనాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

నిజామాబాద్ జిల్లాలోని గుత్ప ఎత్తిపోతల పథకాన్ని విస్తరిస్తే రైతులకు మరింత మేలు చేయవచ్చునని ఆయన అధికారులకు చెప్పారు. జిల్లాలోని పోచారం ప్రాజెక్టును 4 టీఎంసీల సామర్థ్యం నుంచి 5 టీఎంసీల సామర్థ్యానికి పెంచాలని, ఇందుకు అవసరమైన సర్వేను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి అదేశించారు. గుత్ప, పోచారం ప్రాజెక్టులను విస్తరిస్తే జిల్లాలోని జాక్రాన్‌పల్లి, వేల్పూర్ మండలాలకు అదనంగా నీరందిచవచ్చునని ముఖ్యమంత్రి అన్నారు. ప్రాజెక్టుల విస్తరణ పనులను ఏడాదిలోపు పూర్తి చేయాలని నిర్దేశించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలంలోని చాలా గ్రామాల్లో పసుపు పంట పండిస్తున్నారని, ఈ రైతులకు చేయూతనివ్వడానికి, అధిక దిగుబడికోసం పసుపు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే మరింత మేలు జరుగుతుందని అన్నారు.

ఇందుకోసం 1250 ఎకరాల్లో పైలెట్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. నిజామాబాద్ జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండేలా కొత్త భవనాలు నిర్మించాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావులు పాల్గొన్నారు.