మోతె గ్రామ మట్టి ముడుపు విప్పిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్ల క్రితం కట్టిన ముడుపును విప్పడానికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలోని మోతె గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని బోనాలు, బతుకమ్మలతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ముడుపును నెత్తిన పెట్టుకొని సభావేదికపైకి వెళ్లిన కేసీఆర్ అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య ముడుపును విప్పారు.

మోతె గ్రామ మట్టి మూట ప్రత్యేకత
మోతె గ్రామం… తెలంగాణవాదానికి స్ఫూర్తినిచ్చిన గ్రామం. అప్పుడే మొగ్గతొడగిన టీఆర్‌ఎస్ పార్టీని భుజాన వేసుకున్న ఆ ఊరు మరెన్నో పల్లెలకు ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామాభివృద్ది కమిటీ తీసుకున్న నిర్ణయం అనేక పల్లెలను ఆలోచింపచేసింది.

తెలంగాణవాదులను ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రామాలాభివృద్ధి కోసమే కాదు ఆత్మ గౌరవం కోసం ఐక్యమవుదామని నినదించిన మోతె ప్రజల స్ఫూర్తికి గులాబీ బాస్ సలాం చేశారు. తెలంగాణ పది జిల్లాలకు సందేశాన్నిచ్చిన మోతె గ్రామం ఎంపీటీసీ, సర్పంచ్ పదవులతో పాటు జడ్పీటీసీకి సైతం ఏకగ్రీవంగా మద్దతునిచ్చి టీఆర్‌ఎస్‌ను అక్కున చేర్చుకుంది. ఈ స్ఫూర్తి కామారెడ్డి డివిజన్‌లోని మాచారెడ్డి ప్రజలు చాటి 14 ఎంపీటీసీ స్థానాలను, జడ్పీటీసీని ఏకగ్రీవంగా ఎన్నుకొని రాష్ట్రంలోనే చరిత్ర సష్టించారు. అలాంటి స్ఫూర్తిని రగిలించిన మోతెను సందర్శించాలన్న కోరికతో గులాబీ దళపతి కేసీఆర్ 4మే 2001న గ్రామానికి వచ్చారు. గ్రామాభివృద్ది కమిటీ ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్‌ను ఆహ్వానించింది. ఆ గ్రామ ప్రజల ఆత్మ గౌరవాన్ని, ఐక్యత రాగాన్ని చూసి ఆశ్చర్యపడ్డ కేసీఆర్‌కు ఎంతో ైస్థెర్యాన్ని కలిగించింది. గ్రామ కూడలి వద్ద మట్టి చేతబట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ఇదే మట్టితో తిరిగి వస్తానని శపథం చేసిన కేసీఆర్… నేడు మూటగట్టిన అదే మట్టిని పట్టువస్ర్తాల్లో పదిలపరిచి మోతె గ్రామానికి తీసుకువచ్చారు.

శపథాన్ని పూర్తి చేసి తలెత్తుకొని…
మోతె గ్రామ గడ్డపై పవిత్రమైన మట్టిని చేతుల్లో తీసుకున్న కేసీఆర్ గ్రామస్థుల సాక్షిగా ప్రమాణం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు ఫణంగా పెట్టి అయినా తెలంగాణ రాష్ర్టాన్ని సాధిస్తానని శపథం చేశారు. మోతె మట్టి స్ఫూర్తిగా తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతానని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అన్నట్లుగానే పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందాక మోతె గ్రామానికి శుక్రవారం రానున్నారు. మోతె గ్రామ ప్రజల సమక్షంలో శపథాన్ని పూర్తి చేసుకున్న కేసీఆర్ తెలంగాణ సాధకునిగా తలెత్తుకొని ఆత్మ గౌరవంతో వచ్చారు.

ప్రత్యేక పూజలతో మూటమట్టి అప్పగింత…
పిడికెడు మట్టి చేతబట్టి మూటగట్టి తీసుకువెళ్లిన కేసీఆర్ ఆ మట్టిని తిరిగి గ్రామంలోకలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దెలో పెట్టి ప్రత్యేక పూజలు జరిపించారు. గద్దెను పూర్తిగా నిర్మించి కేసీఆర్ శపథం చేసి తెచ్చిన మట్టికి స్ఫూర్తి చిహ్నంగా నిలుపుతారు.