మోసం చేసింది కాంగ్రెస్సే

-తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించింది టీఆర్‌ఎస్సే
– టీఆర్‌ఎస్ విలీనంతో ప్రజలు అన్యాయమవుతారు
– ఒక గొంతుక ఉండాలనే విలీనం చేయలేదు: హరీశ్‌రావు

Harish Rao

తెలంగాణను అడుగడుగునా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయే అని, ఆకుపచ్చని తెలంగాణను మొదటి ఎస్‌ఆర్సీ వద్దన్నా సీమాంధ్రాలో కలిపి కాంగ్రెస్ తెలంగాణకు దోకా చేసిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు.

ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆయన మాట్లాడారు. తొలి దశ ఉద్యమంలో 369 మంది ప్రాణాలను తూటాలకు బలి చేసింది కాంగ్రెస్సే అని, టీపీఎస్ 11 పార్లమెంట్ స్థానాలు గెలిస్తే ప్రజాతీర్పును కాలరాసి ద్రోహం చేసింది కాంగ్రెస్సే అని, 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుని అధికారంలోకి రాగానే తెలంగాణ ఇవ్వకుండా దోకా చేసింది ఆ పార్టీయేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2009లో ఉద్యమాలతో అట్టుడికి పోతుంటే రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితిని కేసీఆర్, ప్రజలు కాంగ్రెస్‌కు కల్పించారని స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌ను మోసం చేసిందని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్రమంత్రి జైరాంరమేశ్ మాట్లాడడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని తెలంగాణకు అడుగడుగునా అడ్డుతగిలి 1200 మందిని పొట్టన పెట్టుకుందని దుయ్యబట్టారు. కేవలం ఎన్నికల్లో సీట్ల కోసం ఇప్పుడు తెలంగాణ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమైతే తెలంగాణ ప్రజలు అన్యాయమవుతారన్నారు. రాష్ట్రం ఏర్పడింది కానీ, ఇంకా పంపకాలు జరగలేదని, స్థానికత ప్రకారం ఆంధ్రా ఉద్యోగులు సీమాంధ్రకు వెళ్లాలని, నీళ్లు, నిధులు, ఉద్యోగాల పంపిణీ జరగాలన్నారు. విలీనమైతే పంపకాల్లో తెలంగాణకు రావాల్సిన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు దక్కవన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లు తెలంగాణలో గెలిస్తే సీమాంధ్ర పెత్తనం కొనసాగి ప్రజలకు మరింత అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ హక్కుల కోసం ఒక గొంతుక ఉండాలని టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయలేదని తేల్చిచెప్పారు.