మూడు రోజుల్లో పారిశ్రామిక విధానం

-అవినీతిరహితంగా ఇండస్ట్రియల్ పాలసీ
-పరిశ్రమల కోసం 2 లక్షల ఎకరాలు సిద్ధం
-ఉద్యోగులకోసం పారిశ్రామికవాడల్లో టౌన్‌షిప్స్
-ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల పరిశీలన
-పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్‌తో సీఎం కేసీఆర్

KCR 01

ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. అవినీతిరహిత పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మూడు రోజుల్లో విధి విధానాలను ఖరారు చేస్తామని ప్రకటించారు. బుధవారం సచివాలయంలో పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ నేతృత్వంలోని బృందం సీఎం కేసీఆర్‌ను కలిసింది.

ఈ సందర్భంగా వారితో మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికరంగంపై అనుసరించే విధానాలను వివరించారు. పలుదేశాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేశామని, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి వారి సలహాలు, సూచనలు స్వీకరించామని వారికి తెలిపారు. విధాన రూపకల్పనతోపాటు దానిని కట్టుదిట్టంగా అమలుచేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి పారిశ్రామిక విధానం కీలకమని తాము భావిస్తున్నామన్నారు. సీఎం కార్యాలయంలోనే చేజింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని, దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలను సాదరంగా ఆహ్వానించి, అవసరమైన అనుమతులిచ్చే వ్యవస్థను సరళం చేస్తామని చెప్పారు.

సింగిల్‌విండో వ్యవస్థను నెలకొల్పడంతోపాటు దానికి ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తున్నట్లు బృందానికి వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో పరిశ్రమలను ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేయడానికి 2 లక్షల ఎకరాలకు పైగా ల్యాండ్ బ్యాంకు సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమలకు అన్ని రకాల రాయితీలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. అవినీతిని రూపుమాపేందుకు దరఖాస్తు మొదలు అన్నింటికీ ఆన్‌లైన్ వ్యవస్థను అనుసరించనున్నట్లు చెప్పారు. పారిశ్రామికవాడల్లో టౌన్‌షిప్స్ ఏర్పాటు చేసి, సదరు పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగులకు, కార్మికులకు నివాసం కల్పిస్తామన్నారు.

టీఎస్‌ఐఐసీ ద్వారానే అన్ని అనుమతులు
భూమి, నీరు, కరెంటుతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు, సంబంధిత అనుమతులు కూడా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇచ్చే వ్యవస్థను రూపొందిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. విప్రో సంస్థ 5 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొచ్చిందని, ఇంకా అనేక సంస్థలు సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపారు. పిరమల్ సంస్థకు కూడా పరిశ్రమలు నెలకొల్పేందుకు కావాల్సిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. స్థలాలు కేటాయించేందుకు సీఎం సంసిద్ధతను వ్యక్తం చేశారు. అలాగే ఫార్మా సిటీని నిర్మించనున్నామని తెలిపారు.

మూడేళ్లల్లో మిగులు విద్యుత్
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ లోటు ఉన్న మాట వాస్తవమేనని, కానీ త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 2015లోగా ఎన్‌టీపీసీ నుంచి 4000 మెగావాట్లు, ఇతర ప్రాజెక్టుల ద్వారా 2350 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మూడేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుందని ప్రకటించారు. దీని కోసం మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించినట్లు చెప్పారు.

గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల ఫలితంగానే తెలంగాణ ప్రజలు నష్టపోయారన్నారు. రెండు, మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం వస్తుందని చెప్పా రు. రాష్ర్టానికి సంబంధించిన అన్ని విషయాలపై సరైన గణాంకాలు కూడా లేవని, తమ ప్రభుత్వం దీని కోసం సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. రాష్ట్రంలోని 84 లక్షల కుటుంబాల సర్వేను ఒకే రోజు నిర్వహించడానికి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. భేటీలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, పిరమల్ గ్రూపు ప్రతినిధులు అజయ్ పిరమల్, పరేష్, బాలాజీ పాల్గొన్నారు.