మూడేండ్లలో ఎస్సెల్బీసీ

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్సెల్బీసీ) సొరంగం పనులను మూడేండ్లలో పూర్తిచేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఎన్ని వ్యయప్రయాసలెదురైనా వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా చందంపేట మండలం నేరడుగొమ్ము వద్ద రూ.570 కోట్లతో చేపట్టనున్న ఓపెన్ కెనాల్, పెండ్లిపాకల ప్రాజెక్టు సామర్థ్యం పెంపు పనులకు విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి హరీశ్‌రావు భూమి పూజచేశారు.

Harihs Rao laid Foundaton stone for SLBC project

-సొరంగం పనులను పూర్తిచేస్తాం
-పాలమూరు, జూరాల ఎత్తిపోతలు చేపట్టి తీరుతాం: మంత్రి హరీశ్
-నల్లగొండ జిల్లాలో 570కోట్లతో పనులకు భూమిపూజ
-పాల్గొన్న మంత్రులు జగదీశ్‌రెడ్డి, నాయిని
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్లోరైడ్ సమస్యకు నక్కలగండి ఎత్తిపోతలతోనే పరిష్కారం లభిస్తుందని అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చి ఈ పథకాన్ని చేపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులకు భారీగా నికరజలాల కేటాయింపులు జరగాల్సిన అవసరం ఉందన్నారు. నీటి కేటాయింపుల కోసం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని హరీశ్‌రావు తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ జిల్లా సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన ఉందని, అందువల్లనే రాష్ట్రంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్ పనులకు నల్లగొండ జిల్లాలోనే శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. మిషన్ కాకతీయలో భాగంగా నల్లగొండ జిల్లాలో 5 వేల చెరువులను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు.

బాబు సైంధవ పాత్ర..
నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తాగు, సాగునీటి వసతి కల్పనకు పాలమూరు-రంగారెడ్డి, జూరాల-పాఖాల ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపట్టేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంసిద్ధమవుతుంటే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుపడుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఆ ఎత్తిపోతల పథకాలకు అనుమతులు ఇవ్వకుండా కేంద్రానికి లేఖలు కూడా రాస్తూ కుట్రలకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఈ ఎత్తిపోతల పథకాలను చేపట్టి తీరుతామని స్పష్టంచేశారు. బాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, తెలంగాణలో ఆ పార్టీ జెండాలను మోస్తున్న నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు.

సహకరించండి..:
సీఎం కేసీఆర్ సంకల్పించిన బంగారు తెలంగాణ నిర్మాణంలో అన్ని పార్టీలు రాజకీయాలకతీతంగా సహకరించాలని మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి కోరారు. 14ఏండ్లలో చేసిన ఉద్యమం కంటే రెట్టింపు కృషి తెలంగాణ అభివృద్ధికి చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారని వివరించారు. రాజకీయ పార్టీలకు సం బంధం లేకుండా అధికారుల ద్వారానే సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యంతోనే 40 ఏండ్లుగా ఎస్సెల్బీసీ ప్రాజెక్టు పూర్తికాలేదని విమర్శించారు.

వచ్చే ఐదేండ్ల కాలంలో ప్రతి ఎకరాకు నీరందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీందర్, దేవరకొండ, మును గోడు ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బాలునాయక్, ఏఎమ్మార్పీ సీఈ పురుషోత్తంరాజు, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేతావత్ లాలునాయక్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నేనావత్ రాంబాబునాయక్ తదితరులు పాల్గొన్నారు.