ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరు

-6 ఏకగ్రీవాలకుతోడు 4 విజయాలు
-కేసీఆర్ నాయకత్వంపై అపార విశ్వాసం
-రాబోయే గ్రేటర్ ఎన్నికలకు నైతిక బలం
-రెండు స్థానాలతో సరిపెట్టుకున్న కాంగ్రెస్
-తెలుగుదేశం గల్లంతు, పోటీలోనే లేని బీజేపీ
-నిలబడిన ఒక్క సీటులోనూ చేతులెత్తేసిన లెఫ్ట్

TRS MLC's

టీఆర్‌ఎస్ కొత్త చరిత్ర లిఖించింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 12 స్థానాలకు గాను పది స్థానాలను గెలుపొంది రికార్డు సృష్టించింది. మొన్నటికిమొన్న వరంగల్ ఉపఎన్నికలో తెలంగాణ ప్రజానీకం అద్భుతమైన తీర్పునిచ్చి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంపట్ల, ప్రస్తుత ప్రభుత్వం పట్ల అపారమైన విశ్వాసాన్ని ప్రదర్శించినట్టుగానే.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బ్రహ్మాండమైన మద్దతును ఇవ్వడం ద్వారా స్థానిక ప్రజాప్రతినిధులు సైతం అలాగే స్పందించారు.
రానున్న గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఫలితాలు అధికార పార్టీకి మంచి నైతిక ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ ఫలితాలతో ఆయా జిల్లాల్లో అధికారపార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. 2015వ సంవత్సరం వెళ్తూవెళ్తూ మాకు మంచి కానుక ఇచ్చింది అని రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఏకగ్రీవాలతో, ఏకపక్షపోటీలతో తన ఆధిపత్యాన్ని స్పష్టంగా నిరూపించుకోగా, టీడీపీ అడ్రస్ లేకుండా గల్లంతైపోయింది. ఆ పార్టీ కనీస ఓట్లను కూడా సాధించలేకపోయింది.

మండలిలో తిరుగులేని టీఆర్‌ఎస్
కొంత అర్బన్, కొంత రూరల్ వాతావరణం ఉండే రంగారెడ్డి జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకుగాను రెండింటినీ గెలుచుకోవడం ద్వారా టీఆర్‌ఎస్ రాబోయే గ్రేటర్ ఎన్నికలకు మరింత ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నది. అలాగే ఖమ్మంలో టీఆర్‌ఎస్ బలహీనంగా ఉందనే ప్రతిపక్షాల రాజకీయ విమర్శలకు ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవడం ద్వారానే టీఆర్‌ఎస్ దీటైన సమాధానమిచ్చింది. ఈ ఫలితాలతో ఖమ్మం జిల్లా రాజకీయాల తీరే మారనుందనేది సుస్పష్టం. లెఫ్ట్, కాంగ్రెస్, టీడీపీ ఒక్కటైనా సరే ఇక్కడ గెలుపు సాధించలేక పోయాయి.