మిషన్‌తో రైతుల కల సాకారం

-చెరువు పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
-చెరువులో నీరుంటేనే గ్రామాలు సస్యశ్యామలం
-చెరువుల పునరుద్ధరణ ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులు

mission Kakatiya

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో రైతుల కల సాకారమవుతుందని, చెరువుల పునరుద్ధరణ పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం పలు జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని చెరువు పనులను ప్రారంభించారు. వరంగల్ జిల్లా రేగొండ మండలం రేపాకపల్లి, మడ్తపల్లి, గూడెప్పల్లి, భాగిర్తిపేట, నారాయణపురం, సుల్తాన్‌పురం, నిజాంపల్లి చెరువుల పునరుద్ధరణ పనులను శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రారంభించి మిషన్ కాకతీయలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మద్దూరు, బచ్చన్నపేటలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, కొండాపూర్ చెరువుల పనులను ఎంపీ వినోద్‌కుమార్, పార్లమెంటరీ కార్యదర్శి వొడితెల సతీశ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చెరువులతోనే గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయన్నారు. సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే టీ జీవన్‌రెడ్డి చురుకుగా పాల్గొంటున్నారు. రాష్ట్ర శాసనసభ సాక్షిగా ఈ అంశంపై ప్రసంగించిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పథకాన్ని అభినందించారు. జగిత్యాల నియోజకవర్గంలోని పలు చెరువుల పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, దుబ్బాక నియోజకవర్గం చెల్లాపూర్, రాజక్కపేటల్లో ప్రభుత్వ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, హత్నూర, కౌడిపల్లి మండలాల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రారంభించారు.

నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలో అక్కలమ్మ చెరువు, నోముల పరిధిలోని గొరెంకలకుంట పనులను ఎమ్మెల్యే వీరేశం ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలంలోని చౌటపల్లి దామర్లచెరువు, నడింపల్లి ఇప్పల చెరువు పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్‌తో కలిసి ప్రారంభించారు. హన్వాడ మండలం దచ్చక్‌పల్లి చెరువు పనులను పార్లమెంటరీ రెవెన్యూ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని దుబ్బగూడ చెరువు, ఉషేగాం చెరువు పనులను ఎంపీ నగేశ్, పార్లమెంటరీ కార్యదర్శి కోవ లక్ష్మి, మంచిర్యాల మండలం వేంపల్లి కండివాగుకుంట, లక్షెట్టిపేట మండలం లక్షీపూర్‌లోని చుక్కకుంట చెరువు పనులను ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రారంభించారు.మిషన్ కాకతీయ కార్యక్రమం అద్భుతమని, ఇందులో ఎలాంటి అవినీతి చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. కరీంనగర్ జల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన సీపీఎం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.