మిషన్ కాకతీయకు నాబార్డు సాయం

-ప్రతిష్ఠాత్మక వాటర్‌గ్రిడ్ పథకానికీ చేయూత
-వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలకు తోడ్పాటు
-విభజన పూర్తయితే కో ఆపరేటివ్ బ్యాంక్‌కు నిధి
-సీఎం కేసీఆర్‌తో నాబార్డు చైర్మన్, డీఎండీ భేటీ

KCR with NABARD Chairmen01

రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు, ఇతర రంగాలతోపాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలకు ఆర్థికసాయం అందించేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) ముందుకొచ్చింది. మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును నాబార్డు చైర్మన్ హరీశ్‌కుమార్ భన్వాలా,డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్లు ఆర్ అమేలోర్ పర్వనాథన్, జీజీ మమ్మెన్‌లు సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా భన్వాలా మాట్లాడుతూ.. తమ సంస్థ అన్ని రాష్ర్టాలకు వ్యవసాయ సంబంధమైన కార్యకలాపాలకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో 959 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయని, వాటి వేగం పెంచాలని చైర్మన్ కోరారు. దానికి సీఎం కేసీఆర్ స్పందించి.. అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మిషన్ కాకతీయ ప్రతిష్ఠాత్మకం
ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టు అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని సీఎం కేసీఆర్ వారితో అన్నారు. ధ్వంసమైన చెరువులను ఇప్పుడు ప్రభుత్వం పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. దానికి నాబార్డు సాయం చేయాలని కోరగా చైర్మన్ అంగీకరించారు. వ్యవసాయ కూలీల కొరత ఉన్నందున సేద్యంలో ఆధునిక యంత్రాలను ఎక్కువగా వాడాలని సీఎం చేసిన సూచనకు ఆమోదం తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకోసం ఒక ప్రత్యేక క్లబ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు చైర్మన్ హరీశ్‌కుమార్ తెలిపారు. భూసార పరీక్షలు, సాయిల్ మ్యాపింగ్ చేసేందుకు ఆర్థిక సాయం చేయాలని సీఎం కేసీఆర్ కోరారు.

మౌలిక సదుపాయాల కింద వాటర్‌గ్రిడ్
మౌలిక సదుపాయాల కల్పనకింద వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు తమ బ్యాంక్ గ్రామీణ మౌలిక వసతుల కల్పన నిధి కింద ఆర్థిక సాయం అందిస్తుందని హరీశ్‌కుమార్ చెప్పారు. ఫార్మా సిటీని ఏర్పాటు చేసేందుకు కూడా సాయం అందించాలన్న సీఎం విజ్ఞప్తిని ఆయన అంగీకరించారు. నదులు, వాగులు, వంకలపైన చెక్ డ్యామ్‌లు ఏర్పాటు చేసేందుకు, గ్రామీణ గోదాముల ఏర్పాటుకు నాబార్డు నిధులను సమకూర్చనుంది. సమావేశంలో నీటి పారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగ్‌రావు, పంచాయత్‌రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమాండ్ పీటర్, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.