మిషన్ కాకతీయ వేగవంతం

-ఖాళీ పోస్టుల భర్తీకి చకచకా చర్యలు
-115 పోస్టుల్లో రిటైర్డ్ ఇంజినీర్ల నియామకం
-కాంట్రాక్టు పద్ధతిలో నియామకానికి ఉత్తర్వులు
-మరో 20 మంది ఈఈలకు స్థానచలనం
-పైరవీకారులను పక్కనపెట్టాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశం

Harish Rao meeting with Irrigation Dept in Mahaboobnagar

రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం వేగం పుంజుకుంది. పథకం అమలులో కీలకమైన ఇంజినీరింగ్ అధికారుల నియామక ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన అధికారుల కొరతను అధిగమించేందుకు నీటిపారుదలశాఖలో సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన ఇంజినీర్లను మిషన్ కాకతీయ పథకం కోసం నియమించాలని నిర్ణయించింది. ఇప్పటికిప్పుడు కొత్త ఇంజినీర్లను నియమిస్తే అనుభవలేమి కారణంగా సమస్యలు వచ్చే ప్రమాదముండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 115 పోస్టులను రిటైర్డ్ ఇంజినీర్లతో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిలో డిఫ్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, టెక్నికల్ ఆఫీసర్లుగా సేవలందించిన ఉద్యోగులున్నారు. వీరందరినీ కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వీరికి నెలకు రూ.25 వేలు వేతనం చెల్లిస్తారు. అయితే, 65 సంవత్సరాల వయసులోపువారినే కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించాలని నిబంధన విధించారు. అదేవిధంగా వారి గత సర్వీసులో అవినీతి ఆరోపణలు, డిపార్ట్‌మెంట్ పరంగా క్రమశిక్షణా చర్యలకు గురైనవారిని అనర్హులుగా ప్రకటించారు.
20 మంది ఈఈల బదిలీ..
మిషన్ కాకతీయలో భాగంగా ఇటీవలే 11 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను (ఈఈ) బదిలీచేసిన నీటిపారుదలశాఖ.. గురువారం మరో 20 మంది ఈఈలకు స్థానచలనం కల్పించింది. టెండర్ల ఖరారులో ఈఈ పాత్ర కీలకంగా మారనుండటంతో, సమర్ధులైన అధికారులను కీలక ప్రాంతాల్లో నియమించాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు నిర్ణయించారు. పోస్టుల కోసం పైరవీలు చేసేవారికి ప్రాధాన్యం లేని చోట పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నీటిపారుదలశాఖలో కాసులవర్షం కురిపించే పోస్టుల్లో కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) పదవి ఒకటి. ఈ పోస్టుకోసం భారీస్థాయిలో పైరవీలు జరుగుతున్నాయి. కూర్చున్న చోటికే డబ్బు వచ్చిపడుతుందని పేరున్న ఈ పోస్టులో ఇంతకాలం ఆంధ్రా అధికారి ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన ఆంధ్రాకు వెళ్లిపోవటంతో సీఓటీ పోస్టు ఖాళీ అయ్యింది. దీంతో ఈ పోస్టుకోసం ఓ అధికారి ఏకంగా 15 రికమండేషన్లు చేయించినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇలాంటివారికి ప్రాధాన్యం లేనిచోట పోస్టింగ్ ఇవ్వాలని అధికారులకు మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేసినట్లు సమాచారం.