మెట్రోరైల్‌ను విస్తరిస్తాం

– 250 కిలోమీటర్లకు పెంచుతాం
– సకాలంలో పూర్తిచేసి.. హైదరాబాదీలకు కానుకగా అందిస్తాం
– మెట్రోసహా మోనో, బీఆర్‌టీఎస్, ఎల్‌ఆర్టీఎస్‌లను చేపడతాం: మంత్రి కేటీఆర్

KTR

మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను భవిష్యత్‌లో 250 కిలోమీటర్లకు విస్తరిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు.

ప్రాజెక్ట్‌ను ప్రస్తుతం ఉన్న 72 కిలోమీటర్లకే పరిమితం చేయకుండా భవిష్యత్ అవసరాలకోసం 250 కిలోమీటర్ల వరకు విస్తరించేందుకు మాస్టర్ ప్లాన్‌ను తయారు చేయనున్నామని చెప్పారు. ప్రభుత్వం మెట్రో ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి కట్టుబడి ఉందని, పత్రికలు, మీడియా కథనాలతో ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేసి హైదరాబాదీలకు కానుకగా అందిస్తామని చెప్పారు. శుక్రవారం హోటల్ మ్యారీగోల్డ్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెట్రో అండ్ రైల్ టెక్నాలజీ (ఐఎంఆర్‌టీ) పీజీ కోర్సు మొదటి బ్యాచ్ ప్రారంభ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మరికొన్ని రోజుల్లో నగర జనాభా రెండింతలవుతుందని, దీని కోసం రెగ్యులేలెడ్ స్రక్చర్డ్ గ్రోత్ సిటీగా అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు.

హైదరాబాద్‌కు 2040 మాస్టర్ ప్లాన్
హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి 2040 మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడానికి కన్సల్టెన్సీలను ఆహ్వానించినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఓ విదేశీ కన్సల్టెన్సీ అధ్యయనాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ మాస్టర్ ప్లాన్‌తో రానున్న రెండు దశాబ్దాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా అవిర్భవించబోతున్నదని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా రవాణాను అభివృద్ధి చేయడానికి మెట్రోరైలు సాధ్యం కాని ప్రాంతాల్లో మోనోరైలు, బీఆర్‌టీఎస్, ఎల్‌ఆర్‌టీఎస్‌ను చేపడతామన్నారు.

1000వ వయాడక్ట్‌ను త్వరితగతిన చేరుకుని రికార్డు సృష్టించిన మెట్రో అధికారులను అభినందిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని కేసీఆర్ ఆదేశించిన విషయం వాస్తవమేనని.. దీనిపై ఎన్వీఎస్ రెడ్డి హెచ్‌ఎంఆర్ ఇంజినీర్లు కసరత్తు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే ట్రయల్ జరుగుతుందని, ప్రాజెక్ట్ పూర్తవుతుందని, విస్తరణను చేపడతామని కేటీఆర్ ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు.
స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేస్తాం
స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. 73వ అధికరణం ప్రకారం స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో సర్పంచ్ సహా, ముఖ్యమంత్రి వరకు అందరూ భాగస్వామ్యం కావాల్సిందేనన్నన్నారు. స్థానిక సంస్థలు విజయవంతంగా పనిచేస్తున్న కేరళ, కర్నాటక రాష్ర్టాలకు త్వరలోనే ప్రత్యేక అధ్యయన బృంధాలను పంపిస్తున్నామన్నారు. మన రాష్ట్రంలోని గంగదేవిపల్లి సహా ఇతర గ్రామాల్లో సైతం ఇదే తరహా అధ్యయనం సాగిస్తామన్నారు.